గుడ్ న్యూస్.. ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేసిన చెన్నై ఆసుపత్రి..!

By సుభాష్  Published on  29 Aug 2020 9:04 PM IST
గుడ్ న్యూస్.. ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేసిన చెన్నై ఆసుపత్రి..!

చెన్నై: చెన్నైకి చెందిన ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు ఆసియాలోనే మొట్టమొదటి ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సను చేసి చరిత్ర సృష్టించారు. కోవిద్-19 కారణంగా ఓ వ్యక్తికి ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. అతడు బ్రతకాలంటే ఊపిరితిత్తులు మార్చాలని అనుకున్నారు.. దీంతో చెన్నైకు చెందిన డాక్టర్లు అతడికి ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ ను నిర్వహించారు. 48 సంవత్సరాల గురుగ్రామ్ కు చెందిన బిజినెస్ మ్యాన్ విషయంలో ఈ ఆపరేషన్ ను చేశారు. ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయని తెలిపారు.

జూన్ 8వ తేదీన సదరు వ్యక్తికి కరోనా సోకిందని.. దీంతో అతడిని చెన్నైకు తీసుకుని వచ్చి ఈసీఎంఓ చికిత్స అందిస్తూ వచ్చామని.. కరోనా కారణంగా ఊపిరితిత్తులు బాగా దెబ్బతినడంతో లంగ్ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సి వచ్చిందని ఎంజిఎం హెల్త్ కేర్ లో హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ ప్లాంట్ ప్రోగ్రామ్ ఛైర్మన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ కె.ఆర్.బాల కృష్ణన్ తెలిపారు. ఈ సర్జరీ చేసిన టీమ్ ఎంతో జాగ్రత్తగా పని చేసిందని తెలిపారు. ఆ వ్యక్తికి కరోనా లేదని నిర్ధారించుకున్న తర్వాతనే ఆపరేషన్ చేశామని స్పష్టం చేశారు. అతడి రెండు ఊపిరితిత్తులు బాగా పనిచేస్తూ ఉన్నాయని.. ఈసీఎంఓ సపోర్టు కూడా తీసివేశామని అన్నారు. క్లినికల్ కండీషన్ కూడా నిలకడగా ఉందని కో-డైరెక్టర్ డాక్టర్ సురేష్ రావు తెలిపారు.

బ్రెయిన్ డెడ్ అయిన చెన్నై వ్యక్తికి సంబంధించిన ఊపిరితిత్తులను ఈ సర్జరీకి వాడారు. అతడి హృదయాన్ని మరో వ్యక్తికి అందించారు.

ఇప్పటి దాకా 62000 మందికి పైగా భారత్ లో మరణించారు. చాలా మంది ఊపిరితిత్తులకు నష్టం కలిగిన విషయాన్ని గుర్తించకపోవడం వలనే మరణాలు సంభవించాయని రిపోర్టులు చెబుతూ ఉన్నాయి. ఊపిరితిత్తులకు కోవిద్-19 కారణంగా నష్టం కలుగుతుందని వైద్యులు చెబుతూ ఉన్నారు.

లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కారణంగా కోవిద్ సర్వైవర్ల ప్రాణాలను కాపాడవచ్చని వైద్యులు చెబుతూ ఉన్నారు. కోవిద్-19 కారణంగా ఊపిరితిత్తుల్లో ఫైబ్రోసిస్ అన్నది వృద్ధి చెందుతుందని.. దాని వలన ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. కోవిద్ కారణంగా హృదయ నాళాల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయని, తీవ్రమైన అలసట వంటివి కూడా సంభవిస్తూ ఉన్నాయని పలు రిపోర్టులో తెలుస్తోంది.

Next Story