ప్రియురాలి ఆత్మహత్య తట్టుకోలేక యువకుడు బలవన్మరణం
By సుభాష్ Published on 15 March 2020 6:58 PM IST
ప్రియురాలు ఆత్మహత్య చేసుకుందని తెలిసి తాను కూడా ఈ లోకంలో ఉండబోనని ప్రియుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను చనిపోతున్నానంటూ కుటుంబ సభ్యులకు చెప్పి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం రాత్రి సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ మారేడుపల్లికి చెందిన తంగళపల్లి రాములు కుమారుడు బాలకృష్ణ (20) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ధూల్‌పేట ప్రాంతానికి చెందని ఓ యువతితో పరిచయం ఏర్పడింది. సదరు యువతి స్నేహితులుగా తమకు పరిచయం చేసినట్లు కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, శనివారం ఉదయం తాను ప్రేమించిన యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని, ఆమె లేనిది నేను లేనని బాలకృష్ణ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపినట్లు తెలుస్తోంది. ఫోన్ చేసిన కొద్ది సమయంలోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లిన బాలకృష్ణ ఒకటో నంబర్ ప్లాట్ ఫాం పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గమనించిన రైల్వే సిబ్బంది యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ధూల్‌పేటకు చెందిన ఓ యువతిని తమకు పరిచయం మాత్రమే చేశాడని, ఆ యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో, తమ కుమారుడు కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదని బాలకృష్ణ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.