Lookback Politics: బీఆర్ఎస్‌కే అత్యధిక కష్టాలు.. 2023లో భారీ దెబ్బ.. కోలుకోకముందే 2024లో మరో దెబ్బ

2023 సంవత్సరంలో భారీ ఎదురుదెబ్బ ఎదుర్కొన్న బీఆర్‌ఎస్‌కు.. 2024 సంవత్సరం కూడా ఏ మాత్రం కలిసి రాలేదు.

By అంజి  Published on  13 Dec 2024 4:29 AM GMT
Lookback Politics, Telangana, BRS, KCR

Lookback Politics: బీఆర్ఎస్‌కే అత్యధిక కష్టాలు.. 2023లో భారీ దెబ్బ.. కోలుకోకముందే 2024లో మరో దెబ్బ

2023 సంవత్సరంలో భారీ ఎదురుదెబ్బ ఎదుర్కొన్న బీఆర్‌ఎస్‌కు.. 2024 సంవత్సరం కూడా ఏ మాత్రం కలిసి రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారం చెలాయించిన పార్టీకి 2023 సంవత్సరం గడ్డు పరిస్థితి తీసుకు వస్తే 2024 సంవత్సరం మరిన్ని బాధలు తెచ్చి పెట్టింది. 2023 సంవత్సరం చివరలో అధికారాన్ని పొగొట్టుకున్న బీఆర్ఎస్‌.. ఆ తర్వాత ఏడాదిలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎలాగైనా రాణించాలనుకుంది. అయితే ఫలితాలు మాత్రం అందుకు అనుగుణంగా రాలేదు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మొత్తంగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఏడాది తెలంగాణ జరిగిన రాజకీయ పరిణామాల్లో అత్యంత కీలకమైనది ఇదే.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో.. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన కోలుకోలేని దెబ్బ కారణంగా బీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర పార్టీగానే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ఎంతగానో ప్రయత్నించారు. కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి విస్తృత ప్రచారం చేశారు. 16 స్థానాల్లో గెలవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ భారీ షాక్‌ ఇచ్చాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దాదాపు సగం స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు. రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌కు ఈ పరిణామం ఏ మాత్రం ఊహించనిది. కాంగ్రెస్ 8, బీజేపీ 8 సీట్లు గెల్చుకుంది. ఎంఐఎం తన హైదరాబాద్ కోటను నిలబెట్టుకుంది.

బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కూడా పడిపోయింది. బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంక్‌ అంతా కూడా బీజేపీకి వెళ్లింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కేసీఆర్‌ కూతురు అరెస్ట్‌ పార్టీకి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. పార్లమెంట్‌ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కవిత జైల్లోనే ఉన్నారు. అయినప్పటికీ ప్రజలు బీఆర్‌ఎస్‌ పట్ల సానుభూతి కనబర్చలేదు.

ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లోని కీలక నేతలు.. అధికార పార్టీలోకి దూకడం ప్రారంభించారు. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలిచిన 10 మంది శాసనసభ్యులు పార్టీ మారారు. ఇక కేటీఆర్, హరీష్ రావు బీఆర్‌ఎస్‌ పార్టీని నడిపిస్తున్నారు. పార్టీ శ్రేణులు నమ్మకం కోల్పోకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జైలు నుండి విడుదలైన తర్వాత ఇప్పుడిప్పుడే కేసీఆర్‌ కూతురు ఎమ్మెల్సీ కవిత పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యారు.

Next Story