అది 50 వేళ ఏళ్లనాటి పురాతన సరస్సు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలను ఆకర్షిస్తోంది. ఇలా ఆకర్షించడానికి ప్రధాన కారణం గతంలో ఎన్నడూ జరుగని ఘటన ఇప్పుడు జరగటమే. కారణం ఏమిటో తెలీదు కానీ..ఒక్కరాత్రిలో ఉన్నట్లుండి ఆ సరస్సు రంగు మారిపోయింది. సరస్సులోని లవణీయత, ఆల్గే కారణం వల్లే రంగు మారి ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. ఇంతకీ ఆ సరస్సు పేరేమిటో చెప్పలేదు కదూ..లోనార్ సరస్సు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఉన్న సరస్సు వ్యాసార్థం 1.2 కిలోమీటర్లు.

ముంబై కి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సరస్సుకు 50 వేల ఏళ్లనాటి చరిత్ర ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. అప్పటి నుంచి ప్రపంచ నలుమూలల్లో ఉన్న శాస్త్రవేత్తలంతా ఇక్కడికి వస్తుంటారు. లోనార్ సరస్సు రంగు మారటం పై సరస్సు సంరక్షణాభివృద్ధి సభ్యులు స్పందించారు.

ఈ సరస్సుకున్న ప్రాముఖ్యత చాలా గొప్పదని, అందుకే దీనిని దేశ భౌగోళిక వారసత్వంగా గుర్తించామన్నారు సరస్సు సంరక్షణాభివృద్ధి సభ్యులు గజానన్ ఖారత్.

లోనార్ సరస్సు రంగుమారటం ఇదేమి కొత్త కాదన్న ఖారత్..ఈ సారి మాత్రం సరసు లేత గులాబీ రంగులోకి మారటం కాస్త ఆశ్చర్యంగా ఉందన్నారు. గతంలో ఇరాన్ లోని ఓ సరస్సు కూడా ఎరుపు రంగులోకి మారిన విషయాన్ని నెమరవేసుకున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా సరస్సులోని నీటి శాతం తగ్గుతుండటంతో పాటు..ఇక్కడ పెద్దగా వర్షాలు కూడా పడకపోవడంతో సరస్సులోకి కొత్తనీరు కూడా వచ్చి చేరలేదన్నారు. తద్వారా సరస్సులో కనిష్ట నీటి స్థాయి తగ్గడంతో లవణీయత పెరిగి ఆల్గేలో మార్పు వచ్చి ఉండొచ్చన్నారు ఖారత్. అందుకే సరస్సు రంగు మారి ఉంటుందని ఖారత్ చెప్తున్నారు.

కాగా..సరస్సులో నీరు రంగు మారేందుకు ఎవరూ ఎలాంటి రసాయనాలను కలుపలేదని, ఇది ప్రకృతి ద్వారా జరిగిన చర్యే తప్ప మనిషి ప్రమేయమేమి లేదని స్పష్టం చేశారు భూగోళ శాస్త్ర నిపుణులు డాక్టర్ మదన్ సూర్యవంశి. కానీ..ఇప్పటి వరకూ తాము నీటిలోని శిలింధ్రాల వల్ల నీరు ఆకుపచ్చ రంగులోకి మారడమైతే చూశామన్నారు. ఇలా గులాబీ రంగులోకి మారడం ఎప్పుడూ చూడలేదన్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపి లోనార్ సరస్సు గులాబీ రంగులోకి మారడానికి అసలు కారణమేంటో త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story