మిడదల దండును నివారించేందుకు అదే మార్గం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 May 2020 9:00 AM GMT
మిడదల దండును నివారించేందుకు అదే మార్గం

కరోనా వల్ల పడుతున్న కష్టనష్టాలు చాలవని దేశాన్ని మరో ఉపద్రవం ముంచెత్తడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కోట్లాది మిడతలు పంటల మీద దాడి చేస్తున్నాయి. నిమిషాల్లో ఆకులతో సహా పంట మొత్తాన్ని తినేసి తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి. ఏదైనా తెగులు సోకుతున్నట్లు గుర్తిస్తే తర్వాతి రోజు పురుగుల మందు తీసుకొచ్చి పిచికారీ చేసి పంటను కాపాడుకోవచ్చు. కానీ మిడతలు దాడి చేశాయంటే.. ఏం చేయడానికీ సమయం ఉండదు. కొన్ని గంటల్లోనే పంట మొత్తం తినేసి వెళ్లిపోతాయి.

మిడతలు చాలా వేగంగా పునరుత్పత్తితో తమ సంఖ్యను అంతకంతకూ పెంచుకుని వెళ్తుండటం.. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి విస్తరిస్తుండటంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం మిడతల ప్రభావం మొదలైంది. వీటి ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు ఏవో ప్రణాళికలు రచిస్తున్నాయి కానీ.. ఆలోపే తీవ్ర నష్టం వాటిల్లేలా ఉంది. ఈ నేపథ్యంలో వీర రాఘవరెడ్డి అనే వ్యవసాయ శాస్త్రవేత్త రైతుల కోసం ముందుకొచ్చారు. మిడతల బారి నుంచి పంటల్ని కాపాడుకోవడానికి ముఖ్యమైన సూచన చేశారు.

మిడతలు పంట మీదికి వచ్చాక ఏమీ చేయలేమని.. కాబట్టి ముందే పంటల్ని కాపాడుకోవడం కీలకమని ఆయనంటున్నారు. ఇందుకోసం మట్టి మీద ఆధారపడమంటున్నారు. పొలంలో రెండు అడుగులు తవ్వి అక్కడి నుంచి నాలుగు అడుగుల లోతు వరకు ఉన్న 30-40 కిలోల బంకమట్టిని తీయాలని.. దాన్ని 200 లీటర్ల నీటి డ్రమ్ములో వేసి పది నిమిషాలు కలియ తిప్పాలని.. తర్వాత పైన కొంత వడగట్టినట్లు ఉన్న నీటిని పంట తడిసేలా పిచికారీ చేయాలని.. ఆ తర్వాత కింద ఉండే మట్టి ద్రావణాన్ని చెట్ల మొదళ్ల వద్ద వేయాలని.. మిడతలకు కాలేయం ఉండదు కాబట్టి అవి మట్టిని తినలేవని.. తిన్నా అది అరక్క చచ్చిపోతాయని.. ఇలా రోజు విడిచి రోజు నాలుగైదుసార్లు చేస్తే పంటలకు వేరే రకమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని.. మిడతల బెడద లేదనుకున్నాక నీటి పిచికారీ ద్వారా మొక్కలపై ఉన్న మట్టి పోయేలా చేసి పూర్వ స్థితికి తీసుకురావచ్చని.. తక్కువ ఖర్చుతో మిడతల బెడదను తగ్గించుకోవడానికి ఇది ఉత్తమ మార్గమని ఆయన అంటున్నారు.

Next Story