తెలంగాణలో దశల వారిగా పాఠశాలలు ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే..!

By సుభాష్  Published on  29 May 2020 8:49 AM GMT
తెలంగాణలో దశల వారిగా పాఠశాలలు ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే..!

తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలు దశలవారీగా తెరవాలని రాష్ట్ర విద్యాశాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జులై 5 వరకూ పదో తరగతి పరీక్షలు జరగనుండటంతో ఆ తర్వాతే పాఠశాలలు పునః ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఒకే సారి పాఠశాలలు ప్రారంభించకుండా మొదటిగా 8,9,10 తరగతులను ప్రారంభించి, ఆ సమయంలో ఏమైనా భద్రతాపరమైన సమస్యలు ఎదురైతే వాటిని సరిచేసి తర్వాత 6,7 తరగతులను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక ప్రాథమిక పాఠశాలలను మాత్రం మరింత ఆలస్యంగా తెరవనున్నారు. 2020-21 విద్యాసంవత్సరాన్ని ఎప్పుడు మొదలు పెట్టాలన్న దానిపై పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీనిపై శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు.

విద్యాశాఖ ప్రణాళికలు ఇలా..

  • మొదటిగా కొద్ది రోజుల పాటు ఉపాధ్యాయులు విధులకు హాజరై పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాల నిర్వహణకు ప్రణాళికను సిద్ధం చేస్తారు.

  • ముందుగా 8,9,10 తరగతులు ప్రారంభించాలి. ఆ తర్వాత 6,7 తరగతులు, తర్వాత ప్రాథమిక పాఠశాలలు మాత్రం మరింత ఆలస్యంగా ప్రారంభించాలి.

  • విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుని ఒక్కో తరగతికి ఒక్కోలా విరామ సమయాన్ని కేటాయించాలి.

  • బడి చివరి బెల్‌ కొట్టిన తర్వాత అందరినీ ఒకేసారి కాకుండా 5-10 నిమిషాల వ్యవధిని పాటిస్తూ ఒక్క తరగతి విద్యార్థులను బయటకు పంపాలి.

  • అన్ని పాఠశాలల్లో థర్మల్‌ స్కీనింగ్‌ తప్పనిసరి

  • ప్రతీ విద్యార్థికి మాస్క్‌ తప్పనిసరి

Next Story