ప్రధాని నరేంద్రమోదీ కేంద్ర మంత్రులతో శుక్రవారం సమావేశమయ్యారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కోరలు చాస్తుండటంతో లాక్‌డౌన్‌ పొడిగించాలా ..? వద్దా అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తదితరులు హాజరయ్యారు. అయితే లాక్‌డౌన్‌ను పొడిగిస్తే తలెత్తే ఆర్థికపరమైన ఇబ్బందులను అధిగమించగలిగే చర్యలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

కాగా, లాక్‌డౌన్‌ పొడిగించే ఉద్దేశంతోనే వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ నుంచి జార్ఖండ్‌కు 1200 మంది వలస కూలీలు, కార్మికులతో ప్రత్యేక రైలు బయలుదేరింది. మిగతా రాష్ట్రాలు కూడా రైళ్లు లేదా బస్సుల ద్వారా సొంత రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నాయి.

మొదటి విడత ఏప్రిల్‌ 14తో లాక్‌డౌన్ ముగియగా, మళ్లీ మే 3 వరకు పొడిగించింది కేంద్రం. ఇక మళ్లీ లాక్‌డౌన్‌ పొడగింపు అంశంపై ఇప్పటికే ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సూచనలు, సలహాలు తీసుకున్నారు. లాక్‌డౌన్‌ పొడిగించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీకి సూచించారు. ఏకంగా పంజాబ్‌ రాష్ట్రం మే 17వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ పొడిగించింది.

ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ లాక్‌డౌన్ పొడిగిస్తే కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో సడలింపులు ఇచ్చే అవకాశాలున్నాయి. మరి లాక్‌డౌన్‌ పొడిగిస్తారా.. లేదా అనేది మోదీ ప్రసంగం ద్వారా తెలియాల్సి ఉంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.