లాక్‌డౌన్ పొడిగింపే మేలట.. మరో 15 రోజులు..!

By సుభాష్  Published on  26 April 2020 12:19 PM GMT
లాక్‌డౌన్ పొడిగింపే మేలట.. మరో 15 రోజులు..!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి చాపకింద నీరులా ప్రవహించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200లకుపైగా దేశాలకు విస్తరించి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్‌కు మెడిసిన్‌ లేకపోవడంతో పెద్ద దెబ్బేనని చెప్పాలి. ఈ వైరస్‌కు మందు కనిపెట్టి అది పూర్తి స్థాయిలో ప్రయోగించి బయటకు రావాలంటే దాదాపు 2 సంవత్సరాలపైనే పట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. ఇక వైరస్‌ను నియంత్రించాలంటే చేసేదేమి లేక లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గం. సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం తప్ప ప్రస్తుతం ఎలాంటి మార్గం లేదు. అందుకే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.

ఏప్రిల్‌ 14 వరకు ఉన్న లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఇక మే 3 తర్వాత కూడా పొడిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ఆయా రాష్ట్రాలు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా కేసుల సంఖ్యమాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ఇలా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆందోళనలో ఉన్నారు.

మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను సైతం పొడిగించాయి. మళ్లీ ప్రధాని మోదీ సమావేశంలో ముఖ్యమంత్రులు తమ తమ అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు. ఇక లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మే 3వరకు పొడిగిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి మే 7వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఇటీవల లాక్‌డౌన్‌ నుంచి కొన్ని సడలింపులు విధించినా తెలంగాణలో మాత్రం ఎలాంటి సడలింపులు ఇచ్చేది లేదని సీఎం కేసీఆర్‌ తేల్చి చెప్పేశారు.

అయితే సోషల్‌ డిస్టెన్స్‌ పాటించగల వ్యాపారాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రుల ఆలోచన. ఇక దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో మే 18వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లు సమాచారం. అయితే అందరితో చర్చించిన తర్వాతనే మోదీ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎంతో నష్టం వాటిల్లుతోంది. ఈ కరోనా మహమ్మారి దెబ్బకు ఎంతో మంది కష్టాలను అనుభవిస్తున్నారు. కానీ మూడో విడత లాక్‌డౌన్‌లో కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా లాక్‌డౌన్‌ వల్ల ప్రజలకు తీవ్ర స్థాయిలో నష్టాలు ఎదుర్కొవాల్సి వస్తోంది.

అయితే కరోనాను పూర్తి స్థాయిలో నిర్మూలించాలంటే మరి కొన్ని రోజులు లాక్‌డౌన్‌ పొడిగిస్తేనే బాగుటుందని పలు సంస్థలు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ భేటీ

కాగా, మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ భేటీ కానున్నారు. ఏప్రిల్‌ 27న జరగనున్న ఈ భేటీలో మోదీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. అంతేకాదు మే నెలాఖరు వరకూ పొడిగింపు ఉండే అవకాశాలున్నాయని రూమర్లు కూడా వినిపిస్తున్నాయి.

దేశంలో కనీసం వారం రోజుల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గితే లాక్‌డౌన్‌ నుంచి సడలింపు ఉంటుందని భావించాలి. కాని రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో దేశానికి పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఈ సమయంలో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే కరోనా మహమ్మారి పెద్ద ఎత్తున విజృంభించే అవకాశాలున్నాయి. ఇన్ని రోజులు పాటించిన జాగ్రత్తలు వృధా అవుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాగా, తెలంగాణలో గత రెండు రోజుల నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మరి మే 3 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా..? లేక పొడిగిస్తారా.? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Next Story