ఆ ప్రాంతాల్లో ఏప్రిల్ 20 తర్వాత లాక్‌డౌన్ నుంచి సడలింపు: మోదీ
By సుభాష్ Published on 14 April 2020 5:37 AM GMTకరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. కరోనా కట్టడకి విధించిన లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగియనున్న సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ మంళవారం జాతిని ఉద్దేశించి మాట్లాడారు. మే 3వ తేదీ వరకూ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. 19 రోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగుతుందని అన్నారు. అయితే హాట్‌స్పాట్లు లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20వ తేదీ తర్వాత సడలింపు ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. బుధవారం ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుందని పేర్కొన్నారు.
కరోనా వల్ల వృద్దులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా గతం నుంచే అనారోగ్య సమస్యలున్నవారు మరింత జాగ్రత్త వహించడం ముఖ్యమన్నారు. హాట్‌స్పాట్లు ఉన్న ప్రాంతాలపై అధిక ఫోకస్ పెట్టామని, 19 రోజుల పాటు లాక్‌డౌన్ కఠినంగా అమలవుతుందని పేర్కొన్నారు. లాక్‌డౌన్ విషయంలో భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని, ఇంట్లో చేసుకున్న మాస్కులను ఉపయోగించాలని మోదీ సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ఆరోగ్య సేతు మొబైల్ యాప్ తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
వృత్తి, ఉద్యోగంలో సహచరుల పట్ల మంచితనంతో మెలగాలని, ఎవరినీ ఉద్యోగం నుంచి తీసేయకండి అంటూ మోదీ కోరారు. వైద్యులను, నర్సులను, పారిశుద్ధ్య సిబ్బందిని గౌరవించాలని, వారిపై దాడులు లాంటివి చేయవద్దని అన్నారు. వారిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరింత ఆరోగ్యంగా ఉండేందుకు రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ఆయుష్ మత్రిత్వ శాఖ సూచనలు పాటించాలని కోరారు.
మనం ధైర్యంగా, నిబంధనలు పాటిస్తూ కరోనాను ఓడించి తీరుదామన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్త సంవత్సరం జరుపుకొంటున్నాయని అన్నారు. లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు.. ఓ సైనికుడిలా మీరు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన రాజ్యాంగంలో 'వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా' అన్నదానికి అర్థం ఇదే. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజున సామూహిక శక్తిని చాటుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నామన్నారు.