కరోనా విజృంభ‌ణ‌తో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశ‌వ్యాప్తంగా చిత్ర‌విచిత్ర‌మైన కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కూడా అటువంటిదే ఓ కేసు న‌మోద‌య్యింది.

అస‌లే లాక్‌డౌన్‌తో ఊపిరి స‌ల‌ఫ‌కుండా ఉన్న‌ పోలీసులకు ఈ కేసుల‌ను చూసి నవ్వాలో, ఏడ్వాలో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. నిన్న ఉద‌యం పోలీస్‌ స్టేషన్‌కు వ‌చ్చిన‌ ఓ యువతి సార్‌.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌ను క‌ల‌వాల‌ని వుంది.. దయచేసి అనుమతి ఇవ్వండి అంటూ కోరింది. యువ‌తి అభ్యర్ధన విన్న పోలీసులు అవాక్క‌య్యారు.

ఇదిలావుంటే.. ఆ యువ‌తిని ప్రేమిస్తున్న యువకుడు ముందురోజు ఉద‌యం అంబర్‌పేట నుండి బంజారాహిల్స్‌కు వచ్చాడు. అయితే.. చుట్టుపక్కల వారు గమనించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వ‌డంతో.. మా అమ్మాయిని వేధిస్తున్నాడని యువ‌తి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.

దీంతో పోలీసులు అస‌లు విష‌యం తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా.. ఆ అమ్మాయి మీద‌ తనకు ఎలాంటి ప్రేమ‌ లేదనే విష‌యం చెప్పడానికే తాను ఇక్క‌డ‌కికి వచ్చానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అయితే నిన్న పోలీసుస్టేష‌న్‌కు వ‌చ్చిన స‌ద‌రు యువ‌తి.. నా బాయ్‌ఫ్రెండ్‌ను కలవాల్సిందేనని అనుమతి కావాలంటూ బైఠాయించింది. యువ‌తితో మాట్లాడిన పోలీసులు వెన‌క్కి పంపారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.