పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇది ఒకప్పటి మాట.. మరి ఇప్పుడు ?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Jun 2020 8:01 AM IST
పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇది ఒకప్పటి మాట.. మరి ఇప్పుడు ?

పెళ్లంటే నూరేళ్ల పంట..ఇది ఒకప్పటి మాట. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతైనా..పెళ్లంటే ఆన్ లైన్ పంట..డిజిటల్ మంట లాగానే కనిపిస్తోంది. లాక్ డౌన్ ముందు వరకూ ఏ రాష్ట్రంలోనైనా తమతమ సాంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్లు చేసుకునే వారు. నిజానికి అసలు సిసలైన తెలుగు సంప్రదాయంలో జరిగే పెళ్లిళ్లే కరువయ్యాయి. మన పూర్వీకుల కాలంలో 16 రోజుల పెళ్లిపండుగ జరిగేది. వరుడు సినిమాలో చూపించినట్లుగా..పెళ్లి చూపులు ఉండేవి కాదు. ఇరు కుటుంబాల పెద్దలకు ఓకే అయితే చాలు. ఆ తర్వాత లగ్గాలు, పెళ్లి తంతు ఏ ఆటంకం లేకుండా సాగిపోవేవి. కట్నకానుకలు, యార్నాల దగ్గర మగ పెళ్లి వారి అలకలు మామూలే కదా.

ఇక పెండ్లికొడుకు, పెళ్లి కూతురు అయితే..పీటలమీద కూర్చున్నాక జీలకర్ర, బెల్లం పెట్టడంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేవారు. అప్పట్లో మాకు నచ్చలేదన్న మాటే ఉండేది కాదు మరి. పెద్దలు చెప్పిన మాటకు అంత గౌరవం ఇచ్చేవారు. కానీ ఇప్పుడయితే పెద్దలు చూపించిన సంబంధం చేసుకోవడమే గగనమన్నట్లు తయారయింది యువత. ఎవరికి వారే తమ జీవిత భాగస్వామిని స్కూల్, కాలేజీ రోజుల్లోనే వెతుక్కుంటున్నారు. ఒకవేళ ఏదైనా గొడవై ఇద్దరూ విడిపోతే గనుక మళ్లీ కొత్త వ్యక్తి ప్రేమ వ్యవహారం యథావిధిగా నడుస్తోంది. ఇంట్లో పెళ్లి టాపిక్ వస్తే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పలానా వ్యక్తినే చేసుకుంటా. కాదని బలవంతపు పెళ్లి చేస్తే ఆత్మహత్య చేసుకుంటా అంటూ బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. అందుకే చాలా వరకూ పెద్దల అంగీకారంతోనే కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. ప్రియుడో లేక ప్రేయసో మోసం చేస్తే క్షణం కూడా కన్నవాళ్లు, అయినవారి గురించి ఆలోచించకుండా ప్రాణాలు తీసేసుకుంటున్నారు.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే.. కరోనా తెచ్చిన తంటాలతో ఆన్ లైన్ నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. కరోనా ముందు వరకూ హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లి తర్వాత బారాత్ లు చేసుకునేవారు బాగా ఉన్నోళ్లు. ఇవన్నీ చేయడానికి లక్షలు, కోట్ల రూపాయల్లో ఖర్చు. ఇది చూసిన చాలామంది ఎందుకు పెళ్లికోసం అంతంత డబ్బు ఖర్చు చేసేబదులు పేదవారికి కాస్తంత సహాయం చేయొచ్చుగా అనుకుని ఊరుకునేవారు. వారి కడుపుమంటను కరోనా చల్లార్చినట్లుంది పరిస్థితి. ఎంత గొప్పోళ్లైనా ఖచ్చితంగా అనుకున్న తేదీకి పెళ్లి జరగాల్సిందే అనుకుంటే.. 50 కి మించకుండా అతిథుల సమక్షంలో పెళ్లి కానిచ్చేయాలి. పెళ్లికి ముందు, తర్వాత ఎలాంటి ఫంక్షన్లు చేసేందుకు వీల్లేదు. నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్ పెళ్లిళ్లు ఇలాగే జరిగాయి. కొంతమందైతే ఏకంగా ఆన్ లైన్ వీడియో కాల్ లోనే పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. వీడియో కాల్ లో ఫోన్ కి తాళి కట్టేసి పెళ్లి అయిపోయిందంటున్నారు. అలాంటి ఘటనలు కూడా మనం చూశాం.

ఏదేమైనా సుమారు మరో రెండేళ్ల వరకూ ఘనంగా పెళ్లిళ్లు జరగడం గగనమే. వందలాది మంది అతిథులు పెళ్లిళ్లకొచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించే పెళ్లిళ్లను ఇప్పట్లో చూడలేం.

Next Story