తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 59క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని, ఈ ఒక్క రోజే 10 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 59 మందిలో ఒక‌రు పూర్తిగా కోలుకుని వెళ్లార‌ని, 58 మందికి చికిత్స కొన‌సాగిస్తున్న‌ట్లు చెప్పారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ల‌తో పాటు హోం క్వారంటైన్ల‌లో సుమారు 20వేల మందిపైగా ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నార‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 15 వ‌ర‌కు లాక్‌డౌన్ ను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ప‌రిస్ధితిని అర్థం చేసుకుని స‌హ‌క‌రించాలి..

లాక్‌డౌన్‌కు మంచి స‌హ‌కారం అందిస్తున్న ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాం. ప్ర‌జ‌ల స‌హ‌కారం లేక‌పోతే ప‌రిస్థితి ఇంకా దారుణంగా ఉండేద‌ని, అంద‌రి బ‌తుకులు ప్ర‌మాదంలో ప‌డేవని తెలిపారు. ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఈరోజు 10 కేసులు న‌మోద‌య్యాయంటే ప‌రిస్థితిని ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాల‌ని సూచించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వైర‌స్‌కు ఎలాంటి మందు క‌నిపెట్ట‌లేద‌ని, వైర‌స్ వ్యాప్తిని నిరోదించ‌డ‌మే పెద్ద మందు అని తెలిపారు. ‘అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో 11వేల వెంటిలేట‌ర్లు ఉన్నాయి. ఒక్క న్యూయ‌ర్క్ న‌గ‌రంలోనే 3వేలు ఉన్నాయి, ప్ర‌స్తుత్తం వారి అవ‌స‌రం మేర‌కు వారికి 30వేల వెంటిలేట‌ర్లు కావాల్సిన ప‌రిస్థితి ఉంది. అన్ని వ‌న‌రులు ఉన్న అమెరికాలాంటి దేశ‌మే ఆగ‌మాగ‌మ‌య్యే ప‌రిస్థితి ఉంది. కాబ‌ట్టి మ‌న చేతిలో ఉన్న ఏకైక ఆయుధం సామాజిక దూరం. గుంపులుగా రోడ్ల మీద‌కు రాక‌పోవ‌డం, స్వీయ నియంత్ర‌ణ. పారిశుద్ధ్యం పాటించ‌డం త‌ప్ప మ‌న‌కి గ‌త్యంత‌రం’ లేద‌న్నారు. ప్ర‌జలంతా ప‌రిస్థితిని అర్థం చేసుకుని ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

సిద్ధంగా ఉన్నాం..

క‌రోనాను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో సిద్దంగా ఉన్నామ‌న్నారు. 100 మంది అవసరమైన చోట 130 మంది సిబ్బందిని పెట్టుకుంటున్నాం. ఐసోలేషన్‌ వార్డుల్లో 11వేల మందికి చికిత్స అందించగలం. 1400 ఐసీయూ బెడ్స్‌ అందుబాటులో ఉంచాం. 500 వెంటిలేటర్లకు ఆర్డర్లు ఇచ్చాం..అవి వస్తున్నాయి. 12400 ఇన్‌పేషంట్స్‌కు సేవలందించేందుకు బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో 1400 పడకల ఐసీయూ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం. 60వేల మంది వ్యాధికి గురైనా చికిత్స అందించే ఏర్పాట్లు చేశాం. 11వేల మంది విశ్రాంత వైద్యులు, ల్యాబ్‌ టెక్నీషియన్ల సేవలు వాడుకునేలా చర్యలు తీసుకున్నాం. పోలీసులు, ప్రభుత్వ, వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించాలి.  ప్రజల అలసత్వం సరికాదు, బాధలైనా భరించాలి. ఏప్రిల్‌ 15 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నాం అని సీఎం కేసీఆర్ తెలిపారు.

చికెన్‌, గుడ్లు, నిమ్మ, బత్తాయి తినండి..

కరోనా నియంత్రణకు శారీరక ధారుఢ్యంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.చికెన్‌ తింటే కరోనా వైరస్‌ వస్తదని అందరూ ప్రచారం చేస్తున్నారు. చికెన్‌, గుడ్లు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చికెన్ తినొద్దని కొందరు దుర్మార్గులు చేసే ప్రచారాన్ని నమ్మొద్దు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సీ విటమిన్‌ ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మ, సంత్రాలు, బత్తాయితో పాటు దానిమ్మ పండ్లు రోగ నిరోధక శక్తి పెంపొందించుకునేందుకు బాగా ఉపయోగపడుతాయి. మామిడి పండ్లు కూడా బ్రహ్మాండంగా తినొచ్చు. మన పండ్లను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయకుండా మనమే తినేలా చర్యలు తీసుకుంటాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పండ్ల వాహనాలను అడ్డుకోమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

వ్య‌వ‌సాయానికి ఏప్రిల్ 10 వ‌ర‌కు నీళ్లిస్తాం..

రాష్ట్ర‌వ్యాప్తంగా 50ల‌క్ష‌ల పైచిలుకు ఎక‌రాల్లో పంట‌లు చేతికొచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. క‌చ్చితంగా దాన్ని కాపాడుకోవాలి. ఎస్సారెస్సీ, కాళేశ్వ‌రం, నాగార్జున‌సాగ‌ర్‌, జూరాల ఆయ‌క‌ట్టు కింద ఏప్రిల్ 10 వ‌ర‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నీళ్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించాం. నీళ్లు పుష్క‌లంగా ఉన్నాయి. నేరుగా లేదా ఆన్ అండ్ ఆఫ్ ప‌ద్ద‌తిలో ఇస్తాం. రైతులు ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, రైతు స‌మ‌న్వ‌య‌స‌మితి స‌భ్యుల స‌మ‌న్వ‌యంతో పంట‌లు చేతికందేలా చేసుకోవాలి. విద్యుత్ సిబ్బంది ఇప్ప‌టి వ‌ర‌కు గొప్ప‌గా ప‌నిచేశారు. పంట‌లు చేతికందే వ‌ర‌కు క‌ష్ట‌ప‌డాలి. నిరంత‌రాయంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా కావాలని ముఖ్య‌మంత్రి కేసీఆర్ సూచించారు.

 

 

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.