మద్యం దుకాణాల ముందు మందుబాబుల క్యూ.. సామాజిక దూరం గాలికి
By తోట వంశీ కుమార్ Published on 4 May 2020 12:32 PM ISTఎన్నాళ్లో వేచిన ఉదయం.. రానే వచ్చింది అంటున్నారూ మందు బాబులు. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి లాక్‌డౌన్‌ను విధించారు. దీంతో దాదాపు 40 రోజులకు పైగా మందుబాబుల కాళ్లు చేతులు కట్టేసినట్లు అయ్యింది. లాక్‌డౌన్ కాలంలో మద్యం ఎక్కడా లభించకపోవడంతో కొంత మంది వింత వింతగా ప్రవర్తించారు. వారి బాధలను భరించలేక కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే.. తాజాగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో కంటైన్‌మెంట్ జోన్లు తప్ప మిగతా ప్రాంతాల్లో మధ్యం అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. ఇక మద్యం షాపులు ఓపెన్ చేస్తారనగానే మందు బాబులు ఉదయం నుంచే షాపుల వద్ద బారులు తీరారు.
ఆంధ్రప్రదేశ్‌లో అయితే.. మద్యం దుకాణాలను తెరవకముందు నుంచే క్యూ కట్టారు. కొన్ని ప్రాంతాల్లో అయితే.. ఈ క్యూ కిలోమీటర్ల మేర ఉంది. గుంటూరు, నెల్లూరు, విశాఖ, చిత్తూరు, తిరుపతి, అనంతపురం ప్రాంతంలో దుకాణాల వద్దకు మద్యం ప్రియులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. చాలా చోట్ల సామాజిక దూరాన్ని పాటించడం లేదు. ఇక రాష్ట్రంలో ఉదయం 11 నుంచి రాత్రి 7 వరకు మద్యం అమ్మాకాలు కొనసాగనున్నాయి.
కాగా.. మద్యం ధరలను 25 శాతానికి పెంచుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. చాలా చోట్ల పెరిగిన మద్యం ధరలు ఇంకా అప్‌డేట్ కాలేదు. దీంతో కొంచెం ఆలస్యంగా మద్యం దుకాణాలను తెరుస్తున్నారు. మందు బాబులను ఆపడం పోలీసులకు తలకు మించిన బారంగానే మారింది. ఇక నోట్లో సుక్క కోసం ఎంత సేపనై ఎదురుచూస్తాం అంటున్నారు మందుబాబులు.