మద్యం డోర్ డెలివరీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!
By సుభాష్ Published on 8 April 2020 3:35 PM GMTకరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో మద్యం షాపులు సైతం మూసి ఉండటంతో మద్యం ప్రియులకు పెద్ద శాపంగా మారింది. ఒక పూట తిండి లేకున్నా.. మందు లేక ఉండలేమన్నట్లుగా తయారయ్యారు. ఈ రోజుల్లో మద్యం తాగడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. మద్యం ప్రియులకు పశ్చిమ బెంగాల్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పినట్లు సమాచారం. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులకు గురవుతున్న మందు బాబులకు డోర్ డెలివరికి అనుమతించాలని సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్‌శాఖ వర్గాల నుంచి తెలుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా మూతబడ్డ మద్యం షాపులను తెరవబోమని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్న వారికి హోమ్ డెలివరీ చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
మద్యం అమ్మేవారికి స్థానిక పోలీస్ స్టేషన్‌లో హోమ్ డెలివరీకి సంబంధిత పాస్‌లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం మద్యం షాపు యజమానులు స్థానిక పోలీసులను సంప్రదించాలి. ఒక్క షాపునకు మూడు డెలివరీ పాస్‌లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వినియోగదారులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయం మధ్యలో ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మద్యం సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల పశ్చిమబెంగాల్ ప్రభుత్వం లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ స్వీట్ షాపులను సైతం కొన్ని గంటల పాటు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.