కరోనా కంటే ఆ రోగం ప్రమాదకరమైంది.. తెలంగాణ సర్కార్‌కు కొత్త తలనొప్పి

By సుభాష్  Published on  8 April 2020 1:43 PM GMT
కరోనా కంటే ఆ రోగం ప్రమాదకరమైంది.. తెలంగాణ సర్కార్‌కు కొత్త తలనొప్పి

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తుంటే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతూ తలమునకలవుతున్నాయి. అదే విధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్‌ రోజురోజుకు కోరలు చాస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో తెలంగాణ ప్రభుత్వానికి మరో కొత్త తలనొప్పి వచ్చిపడింది. అటు కరోనా వైరస్‌పై పోరాటం చేస్తుంటే మరో వైపు మద్యం షాపుల బంద్‌తో మద్యం ప్రియులు ఆస్పత్రి పాలుకావడంతో ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది. మందు దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడంతో ఎర్రగడ్డ మానసిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరుతున్నారు. ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య కూడా కరోనా కేసుల సంఖ్య కంటే డబుల్‌ అవుతోంది. మద్యం ప్రియులతో ఎర్రగడ్డ ఆస్పత్రి నిండిపోవడంతో అటు ప్రభుత్వానికి ఇటు వైద్యులకు ఒక సమస్యగా మారిపోయింది. మందు లేకపోవడంతో మద్యం ప్రియులు విచిత్రంగా ప్రవర్తించడం ఎక్కువైపోతోంది.

ఒక వైపు మద్యం లేకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ ఆస్పత్రిలో క్యూ కడుతుంటే మరో పక్క మద్యం షాపుల్లో చోరీలు జరుగుతున్నాయి. మద్యం లేక ఏం చేయలో అర్ధం కాని కొందరు ముఠాలుగా ఏర్పడి మద్యం షాపుల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు తెలంగాణ ప్రభుత్వానికి కంటిమీద కనుకులేని విధంగా చేస్తున్నాయి. దీంతో మద్యం షాపుల యజమానులు కూడా షాపుల వద్ద రక్షణ కల్పించాలని పోలీసులను, ఎక్సైజ్‌ అధికారులను వేడుకుంటున్నారు. ఏ సమయంలో చోరీ జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని షాపు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒక వైపు కరోనా వైరస్‌ ప్రభావంతో లాక్‌డౌన్‌ కారణంగా సామాన్యుల నుంచి వ్యాపారస్తులు, అలాగే ప్రభుత్వాలు సైతం భారీ స్థాయిలో నష్టపోతున్నాయి. ఇక వైన్స్‌ షాపుల వల్ల భారీగా ఆదాయం పడిపోవడం, మద్యం లేక ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరడం, అలాగే వైన్స్‌ షాపుల్లో చోరీలు జరగడం వల్ల ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది.

Next Story
Share it