హైదరాబాద్‌లో కరోనా కారు

By సుభాష్  Published on  8 April 2020 11:44 AM GMT
హైదరాబాద్‌లో కరోనా కారు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌తో పాటు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు అధికారులు. కరోనాపై అవగాహన కల్పించేందుకు కరోనా హెల్మెట్లు, స్వీట్లు, అలాగే కరోనా జ్యువెలరీ ఇలా రకరకాలుగా ప్రదర్శిస్తూ లాక్‌డౌన్‌ సమయంలో ఎవరూ కూడా బయటకు రావద్దంటూ సూచించారు. రోజురోజుకు విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తోంది.

ఈ చర్యలను లెక్కచేయకుండా జనాలు సైతం రోడ్లపైకి వస్తున్నారు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు కరోనా హెల్మెట్లు వేసుకుని ప్లకార్డులు చేతపట్టి ర్యాలీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇక తాజాగా హైదరాబాద్‌ వీధుల్లో కరోనా కారు తిరుగుతోంది. కరోనా కారు తిరగడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును ఇది నిజమే. ఓ వ్యక్తి వినూత్నంగా కరోనాపై అవగాహన కల్పించేలా కరోనా వైరస్‌ ఆకారం పోలిన ఓ కారును డిజైన్‌ చేయించి రోడ్లపై తిప్పుతున్నారు.

హైదరాబాద్‌లోని సుధా కార్జ్‌ మ్యూజియం వ్యవస్థాపకుడు సుధాకర్‌ అనే వ్యక్తి ఈ కారును తయారు చేసి రోడ్లపై తిప్పుతున్నారు. కేవలం పది రోజుల్లోనే ఈ కారును తయారు చేసినట్లు సుధాకర్‌ చెబుతున్నారు. కారులో ఒకరు కూర్చుని కూడా ప్రయాణించవచ్చు. 100 సీసీ ఇంజన్‌ సామర్థ్యంతో, లీటర్‌కు 40 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని చెబుతున్నారు. దీని ద్వారా ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించవచ్చనే ఉద్దేశంతో దీనిని రూపొందించినట్లు చెప్పారు. దాదాపు 14 సంవత్సరాలుగా సుధాకర్‌ వస్తువుల రూపంలో కార్లను తయారు చేస్తున్నారు. ఇదే విధంగా ఇలా కరోనా కారును తయారు చేసి జనాల్లో అవగాహన కల్పిస్తున్నారు.

Next Story
Share it