వ్యాక్సిన్ వ‌చ్చేంత‌వ‌ర‌కూ లాక్‌డౌన్ కొన‌సాగించండి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 April 2020 2:55 AM GMT
వ్యాక్సిన్ వ‌చ్చేంత‌వ‌ర‌కూ లాక్‌డౌన్ కొన‌సాగించండి..!

క‌రోనా.. ఈ పేరు వింటేనే హ‌డ‌లేత్తిపోతున్నారు జ‌నం. దీని కార‌ణంగా ప్ర‌పంచ‌మంతా అస్త‌వ్య‌స్తంగా మారిన సంగ‌తి తెలిసిందే. ల‌క్ష‌ల మంది ఈ వైర‌స్ బారిన ప‌డ‌గా.. ల‌క్ష‌కు ద‌గ్గ‌ర‌గా మ‌ర‌ణాలు కూడా సంభ‌వించాయి. ఇక ర‌వాణ వ్య‌వ‌స్థ‌, ఆర్థిక స్థితిగ‌తులు ఇలా చెప్పుకుంటూ పోతే.. క‌రోనా సృష్టించిన క‌ల్లోలం అంతాఇంతా కాదు. దీని బారి నుండి బ‌య‌ట ప‌డ‌టానికి ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాలు లాక్‌డౌన్ అస్త్రాన్ని సంధించిన విష‌యం తెలిసిందే.

అయితే.. ఆ లాక్‌డౌన్ ఎన్నాళ్లు అనే ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం లేదు. మ‌న దేశంలో కూడా లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌గా.. దీని గ‌డువు మాత్రం ఏప్రిల్ 15తో ముగియనుంది. మ‌రి మ‌న దేశంలో 15వ తారీఖు రోజున లాక్‌డౌన్ ఎత్తివేస్తారా.. మ‌రికొన్ని రోజులు పొడిగిస్తారా..? ప‌్ర‌స్తుతం ఈ ప్ర‌శ్న హాట్ టాపిక్‌గా ఉన్న త‌రుణంలో.. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను క‌నిపెట్టాకే.. లాక్‌డౌన్‌ ను పూర్తిగా ఎత్తివేయాలని.. లేదంటే వైరస్ వ్యాప్తి విస్త‌రిస్తుంద‌ని హంకాంగ్ కేంద్రంగా పని చేస్తున్న పరిశోధకులు హెచ్చరిస్తున్నార‌న్న వార్త బ‌య‌టికొచ్చింది.

వివ‌రాళ్లోకెలితే.. చైనాలో కొవిడ్-19 వ్యాప్తిపై హాంకాంగ్‌కు చెందిన‌ ప్రొఫెసర్ జోసెఫ్ ట వు నాయ‌క‌త్వంలో కొంత‌మంది ప‌రిశోధ‌కులు అధ్య‌య‌నం చేశారు. ఈ నేఫ‌థ్యంలో వారు కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించారు.

చైనా లాక్‌డౌన్ విధించ‌డం ద్వారా.. కొవిడ్‌ను అదుపులోకి తెచ్చిన నేఫ‌థ్యంలో.. క‌రోనా వైర‌స్‌ను తట్టుకునేందుకు మ‌నిషి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలని.. అది జరగకముందే మ‌ర‌లా మామూలు జీవ‌నం ప్రారంభమైతే.. వైరస్ రెండో దశ వ్యాప్తి మరింత ప్రమాదకరంగా ఉంటుందని.. కాబట్టి చైనా ఇప్పుడు మరింత చురుగ్గా వ్యవహరించాల‌ని సూచించారు. లేదంటే మాళ్లు, స్కూళ్లు, ఫ్యాక్టరీల‌లో పనులు తిరిగి ప్రారంభ‌మై.. వైరస్ మళ్లీ పుంజుకొని మ‌రింత విజృంబిస్తుంద‌ని ప్రొఫెసర్ జోసెఫ్ ట వు తెలిపారు.

ప్ర‌స్తుతం చైనాలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెంద‌డం తగ్గిపోయిందని.. ఇదివరకు వైర‌స్ ఇద్దరు లేదా ముగ్గురికి సోకగా.. ఇప్పుడు ఆ సంఖ్య ఒకటికి తగ్గిందని అన్నారు. ఈ నేఫ‌థ్యంలో ప్రజలు మ‌ళ్లీ సాధారణ జీవితంలోకి అడుగిడితే మాత్రం.. ఈ సంఖ్య వేగంగా వృద్ధిచెందుతుంద‌ని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేఫ‌థ్యంలోనే.. కొవిడ్-19ను పూర్తిగా అణిచివేసేందుకు.. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కనీసం 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్ప‌టివ‌ర‌కూ లాక్‌డౌన్ కొన‌సాగించ‌డం ఉత్త‌మ‌మ‌ని వారు సూచిస్తున్నారు. ఒక‌వేళ‌ లాక్‌డౌన్ ముగిసినా.. ప్రజలు సామాజిక దూరం పాటించడంతో పాటు వాళ్ల పరివర్తనలో మార్పులను కొంతకాలం కొనసాగించాల‌ని.. లేదంటే వైర‌స్ వ్యాప్తి జ‌రుగుతుంద‌ని జోసెఫ్ పేర్కొన్నారు.

Next Story