అంతరిక్ష అద్భుతంగా పరిగణించే గ్రహణాలను చూడాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. ఎప్పుడో చోటు చేసుకొనే  సౌర గ్రహణ  పట్టువిడుపులను ఉత్సాహంగా తిలకించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం సిద్ధమైపోయారు. శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులను పిలిపించుకున్నారు. ఫిల్మ్ తో తయారు చేసిన కళ్లద్దాలను సిద్ధం చేసుకున్నారు. కానీ  మేఘాలు ఆయన ఆశలపై నీళ్లు చల్లాయి. ఆకాశం మేఘావృతం కావడం వల్ల ఆయన సూర్య గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీSpaceక్షించలేకపోయారు. ఆయనేకాదు దేశ రాజధానివాసులు ఎవరూ గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూసే అదృష్టానికి నోచుకోలేదు. అయినప్పటికీ- ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందరూ సూర్య గ్రహణాన్ని తిలకించారు. కేరళలోని కోజికోడ్ నుంచి ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. దేశం మొత్తం మీద కోజికోడ్, పరిసర ప్రాంతాల్లో మాత్రమే రింగ్ ఆఫ్ ఫైర్ ను తిలకించే అవకాశం ఉన్నందున ఈ ఏర్పాటు చేశారు.

అయితే సూర్య గ్రహణాన్ని దేశ ప్రజలతో పాటు తానూ ప్రత్యక్షంగా చూడాలని ఎంతో ఉత్సాహపడ్డాను గానీ, దురదృష్టవశాత్తూ చూడలేకపోయానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అందరు భారతీయుల్లాగే సూర్యగ్రహణాన్ని చూడాలని నేను కూడా చాలా ఉత్సాహపడ్డాను. కానీ దురదృష్టవశాత్తూ మబ్బులు కమ్మి ఉండటం వల్ల దాన్ని చూడలేకపోయాను. కానీ కోజికోడ్‌, ఇంకా ఇతర ప్రదేశాల నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూడటంతోపాటు నిపుణులతో సంభాషించటం ద్వారా ఈ విషయంలో నా పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాను అంటూ గ్రహణ సమయంలో ఓ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను కూడా జోడించారు.

గ్రహణాన్ని చూడ్డానికి ఉపయోగించే ప్రత్యేక కళ్లద్దాలను చేత్తో పట్టుకుని, నల్ల కళ్లద్దాలు ధరించిన మోదీ ఫొటోతో చాలా మంది మీమ్స్‌ తయారు చేశారు. జీతం కోసం నేను ప్రతి నెలా ఇలాగే ఎదురుచూస్తా అంటూ ఒక నెటిజన్‌ జోక్‌ వేశారు. అయితే గప్పిస్తాన్ అనే వ్యక్తి  మోదీ ఫోటో ట్యాగ్ చేసి ఇది ఒక మీమ్ గా మారుతోంది అని పోస్ట్ చెయ్యగా ‘మోస్ట్‌ వెల్‌కమ్‌, ఎంజాయ్‌ అని మోదీ బదులిచ్చారు. దీనితో ఈ ట్వీట్ వైరల్ అయిపొయింది. ఇక  మోదీని  కూలెస్ట్‌ పీఎంగా పేర్కొంటూ.. మోదీ చాలా కూల్‌. దేశం తగలబడిపోతుంటే, ఆయన ఉదాసీనంగా ఉంటారు అని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. మోదీ ట్వీట్‌ చేసిన ఫొటోల ప్రకారం ఆయన ధరించిన కళ్లజోడు మేబాక్‌ కంపెనీదని.. దాని విలువ దాదాపు రూ.1.4 లక్షలని మరో కాంగ్రెస్‌ నేత విమర్శించారు. మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ పోస్ట్ పై మీరూ ఒక లుక్కెయ్యండి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.