మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కనీసం 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలి. దీని వల్ల శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడంతో పాటు మనం కూడా యాక్టివ్‌గా ఉంటాం. మన నిద్ర కూడా మన కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి వల్ల కళ్ల మంట, కంటి నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ప్రతిరోజూ కనీసం 8 గంటలు నిద్రపోవాలి.
రెగ్యులర్‌గా 6 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు కళ్లకు అవసరమైన మేరకు విశ్రాంతి దొరకదు. అందుకే నిద్రను నిర్లక్ష్యం చేయొద్దు. రాత్రి పడుకోవడానికి కనీసం గంట ముందు నుంచి మొబైల్ పక్కనపెట్టాలి. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగింది. ఫలితంగా కంప్యూటర్స్, మొబైల్స్, ట్యాబ్స్‌పై చాలా మంది గంటలకొద్దీ సమయాన్ని వెచ్చిస్తున్నారు.
ఫలితంగా కళ్లు పొడిబారిపోతున్నాయి. కళ్ల మంట, మసకగా కనిపించడంతో పాటు ఇతర సమస్యలు కనిపిస్తున్నాయి. అందుకే స్క్రీన్ సమయాన్ని తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆఫీసులో కంప్యూటర్ ముందు పని చేసేటప్పుడు కంటిపై ఒత్తిడి తగ్గించడానికి ప్రతి 20 నిమిషాలకు, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూసే 20 - 20 - 20 రూల్‌ని పాటించండి.