వర్షాకాలంలో మునగ ఎందుకు తినాలంటే?
వర్షాకాలంలో చల్లని వాతావరణం, గాలిలో ఉండే తేమ కారణంగా రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.
By అంజి
వర్షాకాలంలో మునగ ఎందుకు తినాలంటే?
వర్షాకాలంలో చల్లని వాతావరణం, గాలిలో ఉండే తేమ కారణంగా రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్‌తో ఎక్కువ మంది బాధపడుతుంటారు. దీనికి కారణం వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గడమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఈ కాలంలో వచ్చే కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో పాటు మునగను కూడా కూరల్లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
మునగలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. మునగలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. మునగలో ఉండే ఐరన్, కాల్షియం రక్తహీనత సమస్యను తగ్గించి ఎముకలను కూడా బలోపేతం చేస్తాయి.
మునగలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. బాలింతల్లో పాలు పడేలా చేస్తుంది. బీటా కెరొటిన్ దండిగా ఉండే మునగాకుని తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. అందుకే మునగ ఆకును, మునక్కాయలను కూరల్లో వేసుకోవడం వల్ల ఈ వర్షాకాలంలో మన ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది.