చాలా మందికి పెరుగులో పంచదార కలిపి తినే అలవాటు ఉంటుంది. ఇది రుచిగా ఉండటంతో పాటు ఇలా తింటే మంచి జరుగుతుందని కొందరిలో నమ్మకం ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఇలా తినే అలవాటు ఉంటుంది. కానీ.. పెరుగు, చక్కెర కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పెరుగు, పంచదార కలిపి తినడం వల్ల శరీరానికి అధిక క్యాలరీలు అందుతాయి. కొందిమందిలో ఇది బరువు పెరుగుదలకు దారి తీస్తుంది. షుగర్ అధికంగా తింటే పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా అసమతుల్యతకు గురవుతుంది. ఇది జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది.
పెరుగు, పంచదార కలిపి తినడం వల్ల వయసుతో సంబంధం లేకుండా మధుమేహం వచ్చే అవకాశాలు అధికం అని వైద్యులు చెబుతున్నారు. రోజూ పంచదార కలిపిన పెరుగు తింటే దంతక్షయం వచ్చే అవకాశం ఉందట. పెరుగలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, మెగ్నీషియం ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే పెరుగులో ఏం కలపకుండా తీసుకోవడం, మజ్జిగ రూపంలో తాగడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.