సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడం ఆరోగ్యానికి మంచిదని ఇంట్లో పెద్ద వాళ్లు చెప్తుంటే మనం పట్టించుకోం. అయితే వారు చెప్పేది అక్షర సత్యం. రాత్రి త్వరగా నిద్రపోయి సూర్యోదయం కంటే ముందే నిద్రలేస్తే మనం ఇతరుల కంటే ఆరోగ్యంలోనూ, వర్క్‌లోనూ ముందుంటాం.. ప్రతి రోజు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. దీనికి అనుగుణంగా రాత్రి ముందే నిద్రపోయి ఉదయం కనీసం 5 గంటలకైనా మేల్కొనాలి. లేవగానే ముఖం కడుక్కొని కొద్దిసేపు ప్రశాంతంగా యోగా లేదా ధ్యానం చేయాలి. తర్వాత కాసేపు ప్రకృతి చూస్తూ ఆస్వాదించండి. అలాగే ఆరుబటయ అవకాశం ఉంటే సూర్యోదయం సమయంలో వాకింగ్ చేస్తే మనసు మరింత ఉత్తేజంగా ఉంటుంది.
మనలో నూతనోత్సాహం కలుగుతుంది. తర్వాత ఫ్రెష్ అయ్యి ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.ఇలా రోజూ ముందే నిద్ర లేస్తే ఇతరుల కంటే మనకు 2, 3 గంటలు ఎక్కువ సమయం లభించినట్టు అవుతుంది. దీన్ని శారీరక వ్యాయామం, ధ్యానం కోసం, ఆ రోజు మన ప్రణాళికల కోసం ఉపయోగించవచ్చు. అలాగే కాలేజ్, ఆఫీస్‌కు టెన్షన్ లేకుండా నిర్ణీత సమయం కంటే ముందే చేరుకోవచ్చు. ప్రారంభంలో కాస్త కష్టమైనా అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో మన ఆరోగ్యానికి, కెరీర్‌కు ఈ విధానం ఎంతో మేలు చేస్తుంది.