బాటిల్‌ పాలు ఇస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

తల్లిపాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. బిడ్డ మెదడు, రోగ నిరోధక శక్తి, జీర్ణ వ్యవస్థల పెరుగుదలలో తల్లి పాలు ఎంతగానో సహకరిస్తాయి.

By -  అంజి
Published on : 26 Nov 2025 12:00 PM IST

milk bottle, milk, children, precautions, Health Tips, Lifestyle

బాటిల్‌ పాలు ఇస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

తల్లిపాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. బిడ్డ మెదడు, రోగ నిరోధక శక్తి, జీర్ణ వ్యవస్థల పెరుగుదలలో తల్లి పాలు ఎంతగానో సహకరిస్తాయి. అయితే, కొన్ని పరిస్థితుల్లో కొందరు తల్లులకు పాలు పడవు. అలాంటప్పుడు ఫార్ములా పాలు వాడాల్సి వస్తుంది. వీటిని బాటిల్‌ ద్వారా అందిస్తారు. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.. చాలా మంది పాల బాటిల్‌ ఇచ్చి పిల్లలను నిద్రపుచ్చుతుంటారు. కానీ దీనివల్ల పిల్లల్లో దంతక్షయం, నిద్రలేమి, చెవి ఇన్ఫెక్షన్లు వంటివి వస్తాయి.

దంతక్షయం: ఫార్ములా పాలు తాగి నిద్రపోయినప్పుడు వాటి అవశేషాలు దంతాలపైనే ఉండిపోతాయి. నిద్రపోయేటప్పుడు లాలాజల ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో ఫార్ములా పాలలో ఉండే చక్కెరలు దంతాలపైనే నిలిచి బ్యాక్టీరియాకు ఆవాసంగా మారుతుంది. దీన్నే బేబీ బాటిల్‌ టూత్‌ డికే అంటారు. ఇది దంతాలపై తెల్లటి, నల్లటి, గోధుమ రంగుతో మచ్చలను ఏర్పరుస్తుంది. కొన్ని సందర్భాల్లో పళ్లు దెబ్బతిని రాలిపోతాయి. తర్వాత వచ్చే శాశ్వత దంతాలపై కూడా ప్రభావం చూపుతాయి.

చెవి ఇన్ఫెక్షన్లు: పిల్లలు బాటిల్‌తో నిద్రపోయినప్పుడు, పాలు గొంతు వెనుక భాగంలోకి ప్రవహించి, చెవికి అనుసంధానించే యుస్టాచియన్‌ ట్యూబ్‌కు చేరుతాయి. ఇది వాపుకు కారణం అవుతుంది. తద్వారా చెవి ఇన్ఫెక్షన్లు వస్తాయి.

నిద్రపై ప్రభావం: పిల్లలు అల్లరి చేయకుండా పడుకుంటారని చాలా మంది తల్లిదండ్రులు నిద్రపోయేటప్పుడు బాటిల్‌ అలవాటు చేస్తారు. కానీ ఇది దీర్ఘకాలంలో పిల్లల నిద్రపై ప్రభావం చూపుతుంది. దీన్నే ఫీడ్‌ - టు - స్లీప్‌ అసోసియేషన్‌ అంటారు. ఈ అలవాటుని కొనసాగిస్తే పిల్లలు బాటిల్‌ లేకుండా పడుకోవడానికి ఇష్టపడరు. దీంతో ఏడవటం, రాత్రంతా మేలుకొని ఉండటం వంటివి చేస్తారు.

అధిక బరువు: రోజూ రాత్రిళ్లు ఫార్ములా పాలు తాగడం వల్ల పిల్లల్లో అధిక బరువు సమస్య ఎదురవుతుంది. కేవలం ఫార్ములా పాలే కాకుండా హనీ పాసిఫైయర్స్‌, చక్కెర ఉన్న ద్రవాలు పిల్లలకు ఎక్కువగా ఇవ్వడం వల్ల దంతక్షయం ఏర్పడుతుంది.

దీన్ని ఎలా నివారించాలంటే..

పిల్లలకు నిద్రపోయే 15 నిమిషాల ముందే పాలు ఇవ్వాలి. తర్వాత కచ్చితంగా బ్రష్‌ చేయించాలి. ఫ్లోరైడ్‌ ఉ్న టూత్‌పేస్టుతో వారికి బ్రష్‌ చేయించాలి. సంవత్సరం దాటిన తర్వాత పాలబాటిల్‌ అలవాటు మాన్పించేసి గ్లాసుతో పాలు ఇవ్వడానికి ప్రయత్నించాలి. వారిని పాలబాటిల్‌ నుంచి డైవర్ట్‌ చేయడానికి కథలు చెప్పడం, పాటలు పాడటం వంటివి చేయాలి.. పాల బాటిల్‌ కోసం మొండికేస్తే బాటిల్‌లో నీటిని అందించాలి. ఆరునెలలకు ఒకసారి డెంటల్‌ చెకప్‌కు తీసుకెళ్లాలి.

Next Story