సుప్రీం కోర్టులో ఎల్జీపాలిమర్స్‌కు చుక్కెదురు
By తోట వంశీ కుమార్ Published on 26 May 2020 3:56 PM ISTఫ్లాంట్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎల్జీ పాలిమర్స్‌లోకి వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రతినిధులు సుప్రీంను ఆశ్రయించారు. ప్లాంట్ లో ఉన్న పరిస్థితుల అత్యవసర పరిస్థితుల దృష్ట్యా తాము వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరింది. దీనిపై జస్టిస్ లలిత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
దీని పై ఏపీ హైకోర్టుతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దర్యాప్తు చేస్తున్నాయని ఈ సమయంలో తాము విచారణ జరపలేమని స్పష్టం చేసింది. గ్యాస్ లీక్ వ్యవహారంపై ఏడు కమిటీలు ఏర్పాటు చేశారని, ఏ కమిటీ ముందు హాజరుకావాలో తమకు అర్థంకావడంలేదని ఎల్జీ పాలిమర్స్ అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించింది. దీనికి సుప్రీం ధర్మాసనం బదులిస్తూ.. ఆయా విచారణలు ముగిసిన తర్వాతే సుప్రీం కోర్టుకు రావాలని స్పష్టం చేసింది. ఇక, ఈ పిటిషన్ పై తాము తదుపరి విచారణ చేపట్టలేమంటూ ఎల్జీ పాలిమర్స్ కు తేల్చి చెప్పింది. కాగా.. జూన్ 1న ఎల్జీ పాలిమర్స్ కేసుపై ఎన్జీటీలో విచారణ జరగనుంది. పరిశ్రమ నుంచి స్టైరిన్ గ్యాస్ లీకేజీ కారణంగా 12 మంది మృత్యువాత పడగా.. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు.