విశాఖ ఎల్జీపాలిమర్స్: సంచలన ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
By సుభాష్ Published on 24 May 2020 7:02 PM IST![విశాఖ ఎల్జీపాలిమర్స్: సంచలన ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు విశాఖ ఎల్జీపాలిమర్స్: సంచలన ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/Untitled-11-copy-1.jpg)
విశాఖ ఎల్జీపాలిమర్స్ లో విష వాయువు వెలువడి 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇంకా ఎంతో మంది ఆస్పత్రి పాలయ్యారు. తీవ్ర సంచలనంగా మారిన ఈ ఘటనపై తాజాగా తాజాగా కంపెనీకి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. కీలక ఆదేశాలు జారీచేసింది. పాస్‌పోర్టులను స్వాధీనపర్చాలని కంపెనీ డైరెక్టర్లకు కోర్టు సూచించింది. అంతేకాదు తమ అనుమతి లేనిది కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లవద్దని ఆదేశించింది.
లాక్‌డౌన్ తర్వాత తిరిగి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఎవరి అనుమతి తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ధర్మసనం ప్రశ్నించింది. ఎల్జీ పాలిమర్స్ పరిసరాలను సీజ్ చేయాలని, కంపెనీ డైరెక్టర్లతో సహా ఏ ఒక్కరు కూడా లోనికి అనుమతించకూడదని తెలిపింది. గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ జరుపుతున్న కమిటీలు మాత్రమే ఎల్జీపాలిమర్స్ పరిసరాల్లో ప్రవేశించవచ్చని తెలిపింది. అలాగే విచారణలో భాగంగా ఏం పరిశీలించారో రికార్డు బుక్‌లో నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.
ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం
ప్రమాదం జరిగిన తర్వాత స్టెరిన్ గ్యాస్‌ను తరలించేందుకు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని కోర్టు సూచించింది. అంతేకాదు విద్యాసంస్థలు, ఆస్పత్రులు, జనవాసాలున్నచోట అత్యంత ప్రమాదకరమైన గ్యాస్‌ను ఎలా స్టోర్ చేశారని కోర్టు ప్రశ్నించింది. గ్యాస్ లీకేజీ ఘటనను మే 7న సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, డైరెక్టర్లను స్వేచ్ఛగా వదిలేయడం, అలాగే స్టెరిన్ గ్యాస్ తరలించేందుకు అనుమతించడంపై ఏపీ ప్రభుత్వంపై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. శుక్రవారం నాటి విచారణ తర్వాత హైకోర్టు లిఖితపూర్వక ఆదేశాలు విడుదల చేసింది.