హైదరాబాద్ లో నడిరోడ్డుపై పడుకున్న చిరుత..!
By న్యూస్‌మీటర్ తెలుగు
హైదరాబాద్ ప్రజలను ఈ రోజు వన్య మృగాలు పలకరించడానికి వచ్చినట్లు ఉన్నాయి. గోల్కొండ ప్రాంతంలోని నూరాని మసీదులో నల్ల గండు పిల్లి పోలీసులను అధికారులను, అక్కడి స్థానికులను నిద్ర లేకుండా చేసిన ఘటన మరువక ముందే.. చిరుతపులి హాయ్ చెప్పడానికి వచ్చింది. ఓ వైపు నల్ల గండు పిల్లిని పట్టుకునే పనిని పూర్తీ చేసిన హైదరాబాద్ జూలాజికల్ పార్క్ టీమ్ కు మరో ఫోన్ కాల్ వచ్చింది.
ఈసారి వచ్చింది ఓ చిరుత విషయంలో..! సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో మైలార్ దేవ్ పల్లి ప్రాంతాల్లో ఓ చిరుత రోడ్డుపై కూర్చుంది. దిక్కులు చూసుకుంటూ కూర్చున్న చిరుతకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. చిరుతకు గాయం అవ్వడం వలన అక్కడే ఉండి పోయింది అని భావిస్తూ ఉన్నారు. చిరుత అక్కడ ఉండడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
మైలార్ దేవ్ పల్లి పోలీసు ఇన్స్పెక్టర్ కె.శాంతయ్య గౌడ్ ఈ ఘటనపై న్యూస్ మీటర్ తో మాట్లాడారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న అధికారులను అలర్ట్ చేశామని అన్నారు. రోడ్డుకు ఓ పక్కన పులి కూర్చుని ఉందని అన్నారు. నేషనల్ హైవే – 7పై మాలార్‌దేవ్‌పల్లిలో నడి రోడ్డుపైన ఆ చిరుత గాయాలపాలై రోడ్డుపై కదలకుండా కూర్చుందంటూ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అర్థరాత్రి వేళ చిరుతను రోడ్డుపై వెళ్లే వాహనం ఏదైనా ఢీకొట్టి ఉంటుందని, అందుకే గాయాలయ్యాయని భావిస్తూ ఉన్నారు. సమీప అడవుల నుంచి నగరంలోకి ప్రవేశించి ఉంటుందని.. చిరుత పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు.