సీబీఐ దాడులతో నాకేం సంబంధం లేదు: రాయపాటి సాంబశివరావు

By సుభాష్  Published on  3 Jan 2020 10:32 AM IST
సీబీఐ దాడులతో నాకేం సంబంధం లేదు: రాయపాటి సాంబశివరావు

ముఖ్యాంశాలు

  • కంపెనీ వ్యవహారాలన్నీ సీఈఓనే చూస్తారన్న రాయపాటి

  • సీబీఐ దాడుల వల్ల తనకేం నష్టం కలగలేదన్న మాజీ ఎంపీ

  • పార్టీ మారే విషయంలో ఎలాంటి ఆలోచనలు లేదు

  • వెలుగుచూసిన రాయపాటి కంపెనీ భారీ స్కామ్

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. తన సొంత కంపెనీ చేసిన భారీ స్కామ్ లో అసలు తన పాత్రేమీ లేదని చెప్పే ప్రయత్నం చేశారు. తన కంపెనీ కార్యాలయాల్లో జరుగుతున్న సీబీఐ దాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాయపాటి ప్రకటించారు. తనసలు తరచూ కంపెనీ కార్యాలయానికి కూడా వెళ్లననీ, కేవలం తన సీఈఓ మాత్రం అన్ని రకాల వ్యవహారాలు చూసుకుంటారని చెప్పుకొచ్చారాయన.

ఆ మాట వాస్తవమే..

సీబీఐ అధికారులు తన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన మాట వాస్తవమేననీ అయితే దానివల్ల తనకేం నష్టం జరగలేదనీ, వాళ్లకూ పెద్దగా అనుమానించాల్సింది ఏమీ దొరకలేదుకాబట్టి వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్లిపోయారనీ రాయపాటి సాంబశివరావు మీడియా సమావేశంలో వ్యాఖ్యానించడం గమనార్హం.

అలాంటి ఆలోచనలేం లేదు..

మరో పార్టీలో చేరే అవకాశాలున్నాయా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రాయపాటి ఒకింత అసహనంగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి తనకు అలాంటి ఆలోచనలేం లేవని చెప్పారు. గుంటూరు కేంద్రంగా దశాబ్దాలుగా జయలక్ష్మీ గ్రూప్ ఆఫ్ కంపెనీల పేరుతో రాయపాటి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. పొగాకు, యార్న్, స్పైసెస్ రహదారుల నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి ప్రధాన అంగాలుగా ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది.

Next Story