భారత్‌లో 24గంటల్లో 69,921 కేసులు.. 819 మంది మృతి
By తోట వంశీ కుమార్ Published on 1 Sept 2020 10:34 AM ISTభారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 65వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 69,921 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 819 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 36,91,167కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 28,39,883 మంది కోలుకోగా.. 7,85,996 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 65,288 మంది మరణించారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.7శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజులోనే 10,16,920 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. ఇప్పటి వరకు మొత్తం 4,33,24,834 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. 62,11,796 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. 39,10,901 కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్‌లో కరోనా ఉద్దృతి ఇలాగే కొనసాగితే.. మరికొద్ది రోజుల్లోనే భారత్ రెండో స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.