కుచ్ బెహార్ ట్రోఫీకి కార్మిక క్రికెటర్ పున్నయ్య..!
By అంజి Published on 19 Dec 2019 12:31 PM ISTముఖ్యాంశాలు
- పున్నయ్యను క్రీడల్లో ప్రోత్సహించిన తల్లిదండ్రులు
- తన ప్రతిభతో హెచ్‌సీఏ సెలెక్టర్ల కంటపడ్డ యువకుడు
- మాంచి ఎకనామీ బౌలింగ్‌తో రాణిస్తున్న పున్నయ్య
హైదరాబాద్: తాను పట్టువదలని విక్రమార్కుడినని అంటున్నాడు కూచ్ బెహార్ ట్రోఫీకి ఎంపికైన పేదింటి కుర్రోడు పున్నయ్య (16). ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న పున్నయ్య రోజుకి 3-4 గంటల పాటు క్రికెట్ ప్రాక్టిస్ చేస్తున్నాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయని.. టీమిండియాకు ఎంపికవ్వడమే తన లక్ష్యమని పున్నయ్య చెప్తున్నాడు.
కటిక పేదరికంలోనూ అమ్మనాన్న ఇచ్చిన ప్రోత్సహం మరువలేనిదని యువ క్రికెటర్ పున్నయ్య తెలిపాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన భువనగిరి ఆంజనేయులు తన భార్య పోలమ్మతో 16 ఏళ్ల క్రితం పొట్టకూటి కోసం నగరానికి వలస వచ్చాడు. ఇక్కడే కేపీహెచ్ కాలనీలోని ఖాళీ స్థలంలో గుడిసె నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. పున్నయ్య తండ్రి మొదట్లో రిక్షా నడిపేవాడు. ఇప్పుడు పాత తలుపులు, కీటికీలకు బాగు చేసే పని చేస్తున్నాడు. తల్లి జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పని చేస్తోంది. ఇలా పని చేస్తూ వచ్చిన డబ్బులతో పున్నయ్యను చదివిస్తున్నారు. తల్లిదండ్రులు పున్నయ్యను క్రీడల్లోనూ ప్రోత్సహించారు. దీంతో కేపీహెచ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో పున్నయ్య పాల్గొనేవాడు.
వైవిధ్యమైన బౌలింగ్‌తో క్రికెట్‌లో మెరుగ్గా రాణిస్తున్నాడు. అతని సీనియర్లు గ్రేస్ బాల్‌తో ప్రయత్నించమని సూచించారు. వాళ్లు అనడమే తడువుగా పున్నయ్య గ్రేస్ బాల్‌తో కూడా అదే ప్రతిభను కనబర్చాడు. మాదాపూర్‌లోని జీనియస్ క్రికెట్ అకాడమీలో ఓ రోజు పున్నయ్య క్రికెట్ ఆడుతుండగా.. మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చాముండేశ్వరీనాథ్ కంటపడ్డాడు. పున్నయ్య మాంచి ఎకానమీతో బౌలింగ్ చేసేవాడు. పున్నయ్యను మంచి భవిష్యత్తు ఉంటుందని చాముండేశ్వరీనాథ్ ప్రోత్సహించారు. ఆ తర్వాత పున్నయ్య ప్రతిభను హెచ్‌సీఏ అధికారుల దృష్టికి వెళ్లారు. అంతే అప్పటి నుంచి పున్నయ్య దశ, దిశ మారింది.
హెచ్‌సీఏ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో పున్నయ్య గ్రేస్ బౌలింగ్‌తో తన ప్రతిభతో హెచ్‌సీఏ సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. సూరత్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌కు పున్నయ్య ఎంపికయ్యాడు. ఆతర్వాత కుచ్ బెహార్ ట్రోఫీ ప్రాబబుల్స్‌కి పున్నయ్య ఎంపికయి.. విశేషంగా రాణించాడు. డిసెంబర్ 20 నుంచి 23 వరకు కుచ్ బెహార్ ట్రోఫీ (అండర్-19) జరగనుంది. ఈ ట్రోఫీలో ముంబైతో హైదరాబాద్ జట్టు తలపడనుంది. మంగళవారం నాడు ప్రకటించిన హైదరాబాద్ జట్టులో పున్నయ్యకు చోటు లభించింది.