కుంగ్ ఫూ శేఖర్ పై పీడీ యాక్ట్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Nov 2019 10:54 AM GMT
కుంగ్ ఫూ శేఖర్ పై పీడీ యాక్ట్..!

శ్రీకాకుళం: తరచుగా నేరపూరిత చర్యలకు దిగుతున్న వారిని నిరోధించడానికి ఉపయోగించే పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్ట్ ను రౌడీ షీటర్ పైల చంద్రశేఖర్ అలియాస్ కుంగ్ ఫూ శేఖర్ పై ప్రయోగించాలని పోలీసు శాఖ యోచిస్తోంది. గత దశాబ్ద కాలంగా శ్రీకాకుళం నగరంలో అసాంఘిక శక్తులతో కలసి అతడు చేస్తున్న ఉద్దేశ్య పూర్వక నేరాలఫై పదే పదే ఫిర్యాదులు రావడంతో నగర బహిష్కరణ తో పాటు పీడీ యాక్ట్ పెట్టె అవకాశం ఉంది. 'నివారణ నిర్బంధం' అని పిలిచే ఈ చట్టం ప్రకారం శిక్ష అనుభవించిన నేరస్థుడిని, వారి శిక్ష పూర్తి అయినా సరే, విడుదల చేయడం చాలా ప్రమాదకరమైనదిగా భావిస్తారు. నేరస్థుడు తదుపరి నేరాలకు పాల్పడకుండా నిరోధించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. రెండు రోజులు నగరంలోని ఇద్దరు మెకానిక్ లను ఇంటికి పిలిపించుకుని శేఖర్ విచక్షణా రహితంగా బెల్టుతో కొట్టడం, అవి ఎవరో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి. వీడియోలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో హల్‌చల్ చేయడంతో విశాఖ రేంజ్ డీఐజీ దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే జిల్లా ఎస్పీని దీనిపై వివరణ కోరారు. ఎస్పీ దీనిపై టూ టౌన్ సిఐ విజయానంద్ ను దర్యాప్తునకు ఆదేశించారు. ఎస్పీ సైతం రౌడీ షీటర్ శేఖర్ కార్యకలాపాలఫై రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story
Share it