హైదరాబాద్ : రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో, కర్నాటక రాజధాని బెంగళూరులో రక్షణరంగ పారిశ్రామిక ఉత్పత్తుల కారిడార్ ని నిర్మించకపోవడాన్ని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తప్పుపట్టారు.

హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో రక్షణ రంగ పారిశ్రామిక ఉత్పత్తుల కారిడార్ ని నిర్మించాలని కోరుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కేటీఆర్ గతంలో అభ్యర్థించారు. ఈ అభ్యర్థనకు సంబంధించి కేంద్రంనుంచి కనీస స్పందన కరవయ్యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఉత్తర ప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ లోనూ, చెన్నైలోనూ కేంద్ర ప్రభుత్వం ఈ రక్షణ ఉత్పత్తుల పారిశ్రామిక కారిడార్ ని నిర్మించాలని నిర్ణయించడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఉన్న భౌగోళిక, సాంకేతిక ఉపలబ్ధిని విస్మరించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఉన్న కారణాలు ఏంటో తెలపాలని గతంలోఆయన డిమాండ్ చేశారు. దానికి కేంద్రం స్పందించిన తీరునుకూడా ఆయన దుయ్యబట్టారు.

హైదరాబాద్ లో ఉత్తమ వసతులు, వాతావరణ పరిస్థితులు ఉన్న విషయం గురించి తెలిసికూడా ఉద్దేశపూర్వకంగానే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గర్హనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. రక్షణ రంగానికి, విమానయాన రంగానికి సంబంధించిన ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమలను నెలకొల్పడానికి హైదరాబాద్ అత్యంత అనుకూలమైన ప్రదేశమన్నారు.

చక్కటి వాతావరణ అనుకూలత, అందుబాటులో ఉండే నిపుణులైన మానవవనరులు, కార్మికులు హైదరాబాద్ లో అలాంటి పరిశ్రమలను నిర్మించాలనుకునేవారి పాలిట వరదాయకాలని కేటీఆర్ అన్నారు. ఈ కారణాలవల్లనే దశాబ్దాల క్రితమే ఎక్కువ సంఖ్యలో కేంద్ర రక్షణ రంగానికి సంబంధించిన అనేక పరిశ్రమలకు హైదరాబాద్ వేదికయ్యిందన్న విషయాన్ని ఆయన మరొక్కమారు ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కాంక్లేవ్ లో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాలను ప్రస్తావించారు.

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన అత్యంత కీలకమైన రక్షణ రంగ పరిశ్రమను హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు తాను ఎంతగానో ప్రయత్నించాననీ, అయితే కేంద్రం ఆ పరిశ్రమ ఏర్పాటునకు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రదేశాలను పరిగణనలోకి తీసుకోవడం విస్మయాన్ని కలిగించిందని ఆయన చెప్పారు. కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకోవడం పూర్తిగా అనుచితం అని ఆయన తన అభిప్రాయాన్ని గట్టిగా వ్యక్తం చేశారు.

ప్రాంతీయంగా అందుబాటులో ఉండే అనేక విధాలైన ఉపలబ్ధిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కేంద్రం సముచితమైన నిర్ణయాన్ని తీసుకోవడం మంచిదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మరోమారు సముచితమైన నిర్ణయం తీసుకునేవిధంగా సరైన ఆలోచన చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంతోపాటుగా, కేంద్రానికీ అనేక విధాలైన లాభాలుంటాయన్న సంగతిని గుర్తు చేశారు.

కేవలం రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకోవడంవల్ల, రాజకీయంగా మాత్రమే ఆలోచించడంవల్ల దేశంలో సర్వతోముఖాభివృద్ధిని చేజేతులా అడ్డుకోవడంతప్ప సాధించగలిగేది ఏమీ లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్ లో అత్యధిక సంఖ్యలో 70 పార్లమెంట్ స్థానాలు ఉన్న కారణంగా రాజకీయ లబ్ధికోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. భవిష్యత్తులో భౌగోళిక వనరులు, శక్తి వనరులకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, కొంతకాలం తర్వాత తిరిగి వెనక్కి తీసుకోవాల్సి వచ్చినప్పుడు వాటిల్లే నష్టం గురించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఆలోచించడం సముచితమన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.