కేటీఆర్‌దేనా ఆ విలాస‌వంత‌మైన ఫామ్‌హౌస్‌.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 March 2020 3:42 PM GMT
కేటీఆర్‌దేనా ఆ విలాస‌వంత‌మైన ఫామ్‌హౌస్‌.?

కాంగ్రెస్ నేత‌, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నేడు రాష్ట్ర మంత్రి, సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేశారు. ఈ ఉద‌యం ఎంపీ రేవంత్‌రెడ్డి.. మంత్రి కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌ ముట్టడికి వెళ్లారు. అక్క‌డ విలేక‌రుల‌తో మాట్లాడిన రేవంత్.. కేటీఆర్‌, ఆయ‌న స‌తీమ‌ణి శైలిమాపై ఆరోప‌ణ‌లు గుప్పించారు.

111 జీవోను తుంగలో తొక్కిన‌ మంత్రి కేటీఆర్‌.. అక్రమంగా, కేంద్ర ప్ర‌భుత్వ‌ నిబంధనలకు వ్యతిరేకంగా 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మాణం చేశార‌ని రేవంత్‌రెడ్డి ఆరోప‌ణ‌లు చేశారు. రేవంత్ ముట్ట‌డి సమాచారం అందుకున్న పోలీసులు.. అత‌డిని అడ్డుకుంనేందుకు ప్ర‌య‌త్నించ‌గా జన్వాడ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివ‌రికి రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన రేవంత్.. కేటీఆర్ ఫాం హౌస్ అక్ర‌మ నిర్మాణ‌మ‌ని.. జీవో ఎంఎస్ నెంబ‌ర్ 111కు వ్య‌తిరేకంగా.. జ‌న్వాడ గ్రామంలో చిన్న‌స‌ముద్రం చెఱువు నుండి గండిపేట‌కు ఫిరంగి కాలువ వెళ్తుంద‌ని.. ఈ కాలువ‌ను మూసివేసి కేటీఆర్ అక్ర‌మంగా ఫాంహౌస్ క‌ట్టుకున్నార‌ని విమ‌ర్శించారు. 111జీవోలో ఒక్క నిర్మాణం కూడా జ‌ర‌గొద్ద‌ని.. అటువంటిది మూడంత‌స్తుల ఇంద్ర‌భ‌వ‌నాన్ని రూ.25కోట్లు పెట్టి క‌ట్టాడ‌ని రేవంత్ ఆరోపించారు. మార్కెట్ రేటు ప్ర‌కారం ఈ 25ఎక‌రాల భూమి విలువ రూ.250కోట్లు ఉంటుంద‌ని.. ఇందంతా కేసీఆర్‌, కేటీఆర్ వారి కుటుంబ స‌భ్యుల పేరిట ఉంద‌ని విమ‌ర్శించారు. కేటీఆర్‌, అయ‌న స‌తీమ‌ణిల పేర్ల మీద రిజిస్ట‌ర్ అయిన‌ట్లుగా తెలుపుతున్న‌ డాక్యుమెంట్ల‌ను రేవంత్ మీడియాకు చూపెడుతూ.. కేసీఆర్ ఫ్యామిలీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

ఇదిలావుంటే.. ఈ విష‌య‌మై స్పందించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌.. రేవంత్‌పై ఓ రేంజ్‌లో పైర్ అయ్యారు. 2014 ఎన్నిక‌ల అఫిడవిట్‌లో త‌న ఆస్తులేంటో కేటీఆర్‌ చెప్పారని, ఫామ్‌హౌస్‌ను నాలుగేళ్ల క్రితం కేటీఆర్‌ లీజుకు తీసుకున్నారని తెలిపారు. 8 ఎకరాల 9 గుంటలు మాత్రం కేటీఆర్‌ భార్య శైలిమా పేరుపై ఉందని సుమన్ అన్నారు.

ఇక రేవంత్ ఆరోప‌ణ‌ల‌పై మంత్రి కేటీఆర్ స్పందిచాల్సివుంది. రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న‌ట్లుగా.. కేటీఆర్ నిజంగానే నిబంధ‌ల‌ను ఉల్లంఘించారా..? రేవంత్‌, అత‌ని సోద‌రుడు కొండ‌ల్‌రెడ్డిపై అక్ర‌మ భూదందా ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేఫ‌థ్యంలో ఇటువంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారా.? అస‌లు ఎవ‌రు నిప్పు.. ఎవ‌రు ప‌ప్పు అనేది తేలాల్సివుంది.

Next Story