ఇక్క‌డే పుట్టాను.. అప్ప‌టికి.. ఇప్ప‌టికీ పోలికలే లేవు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 July 2020 10:08 AM GMT
ఇక్క‌డే పుట్టాను.. అప్ప‌టికి.. ఇప్ప‌టికీ పోలికలే లేవు

తెలంగాణ‌ రాష్ట్ర ఐటీ శాఖ‌ మంత్రి కేటీఆర్ నేడు క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో బాగంగా మంత్రి శాతవాహన వర్సిటీలో మెయిన్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా 30ఏళ్ల ప్రణాళికతో రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టామని అన్నారు. తెలంగాణలో గ్రామీణ ప్రజల జీవితాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

కరీంనగర్‌లో ఏ పని ప్రారంభించినా తప్పకుండా విజయ‌వంత‌మ‌వుతుంద‌ని.. తాగు, సాగునీరు, విద్యుత్‌ ఇబ్బందులను తక్కువకాలంలో అధిగమించామన్నారు. కేవలం మూడేళ్ల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామ‌ని.. ఒక్కో పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నామ‌ని అన్నారు. అందరికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామ‌ని.. భవిష్యత్‌ తరాలు బాగుండాలని 230 కోట్ల మొక్కలు నాటాలనేది లక్ష్యమ‌ని అన్నారు.

అనంత‌రం కరీంనగర్‌లో రూ.34 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ టవర్‌లోని కంపెనీల్లో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందేజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని.. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ సేవలు విస్తరించాలని అన్నారు. తాను కూడా కరీంనగర్‌లోనే పుట్టానని.. ఇక్కడే చదువుకున్నానని.. అప్పటి కరీంనగర్‌కు.. ఇప్పటికీ పోలికలే లేవని.. కరీంనగర్‌ అందమైన నగరంగా ఎదుగుతోందని అన్నారు.

రాష్ట్రం ఏర్పడినప్పుడు ఐటీ రంగ అభివృద్దిపై పలు అనుమానాలు ఉండేవని.. అప్పట్లో ఐటీ ఎగుమతులు తక్కువగా ఉన్నాయ‌న్నారు. అయితే.. ఐదేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రస్తుతం ఐటీ ఎగుమతులు రూ.1.28 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. ఐటీ నిర్వచనం క్రమంగా మారుతోంద‌ని.. ఐటీ అంటే ఇంటెలిజెంట్‌ టెక్నాలజీ అని కేటీఆర్ అన్నారు. నైపుణ్యం ఏ ఒక్కరి సొత్తు కాదని.. పట్టణ, గ్రామీణ యువత ఐటీలో సత్తా చాటుతోందని.. స్థానిక స్టార్టప్‌లను అధికారులు ప్రోత్సహించాలని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Next Story