ఢిల్లీ: కేపీ ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దీనికి సంబంధించి కేంద్రవాణిజ్య మంత్రిత్వశాఖ ఇవాల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో కేపీ ఉల్లి రైతుల పోరాటానికి సారథ్యం వహిస్తున్న భారతీయ రైతు సంఘాల సమాఖ్య నేతలు హర్షం వ్యక్తం చేశారు. కృష్ణాపురం ఉల్లిపై నిషేధం తొలగించి రైతులను ఆదుకోవాలని కోరుతూ గత నవంబర్‌లోనే సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌కు లేక రాశారు. కాగా ఆ లేఖపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రమంత్రి డైరెక్టర్‌ జనరల్‌ ఫారిన్‌ ట్రేడ్‌ను కోరారు.

కేపీ ఉల్లిపై నిషేధం ఎత్తివేత కోసం సీఎం జగన్‌ ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీలు ఢిల్లీలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి ఒత్తిడి తీసుకువచ్చారు. తాజా కేపీ ఉల్లిపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు రాజ్యసభలో కేంద్రమంత్రి ప్రకటించారు. ఉల్లి రైతులకు అండగా నిలబడి, ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతకు నిర్విరామంగా కృషి చేసినందుకు వైసీపీ నాయకులకు రైతు సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలను కలిసి స్వయంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే తమ లక్ష్యమని, అదే మా విధానమని పునరుద్ఘాటించారు.

చెన్నై పోర్టు నుంచి 10 వేల మెట్రిక్‌ టన్నుల కేపీ ఉల్లిని ఎగుమతి చేయనున్నారు. మార్చి 31, 2020లోగా ఎగుమతులు పూర్తి చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతతో రైతు నేతల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కేపీ రకం ఉల్లి పంటలను ఎక్కువగా పండిస్తుంటారు. ఈ ఉల్లిని సింగపూర్‌, మలేషియా, శ్రీలంకతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.