ఆ అంశాన్ని మళ్ళీ తీసుకుని రావడంపై అసదుద్దీన్ ఫైర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Sep 2020 2:46 AM GMT
ఆ అంశాన్ని మళ్ళీ తీసుకుని రావడంపై అసదుద్దీన్ ఫైర్

ఎన్నో ఏళ్లుగా రామ మందిరం-బాబ్రీ మసీదు వివాదం భారతదేశంలో సాగింది. చివరికి సుప్రీం కోర్టు ఈ వివాదాస్పద అంశానికి ఇటీవలే తెరదించింది. రామ జన్మభూమిలో రామాలయానికి ఇటీవలే శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. బాబ్రీ మసీదు నిర్మాణానికి కూడా పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదం తెరపైకి వచ్చింది.

మధుర సివిల్‌ కోర్టులో అడ్వకేట్‌ విష్ణు జైన్ ఇటీవలే దావావేయడం సంచలనం అయింది. షాహి ఈద్గా మసీదును తొలగించాలని దావాలో పొందుపరిచారు. మొగల్‌ రాజు ఔరంగజేబు మధురలోని కృష్ణ ఆలయాన్ని కూల్చివేశారని విష్ణు జైన్ అన్నారు. దీంతో మళ్లీ శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది. ఈ విషయంపై ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

శ్రీకృష్ణ జన్మభూమి వివాదాన్ని మళ్లీ తెరపైకి తేవడంలో ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు. శ్రీకృష్ణ జన్మస్ధాన్‌ సేవా సంఘ్‌, షాహి ఈద్గా ట్రస్ట్‌ మధ్య తలెత్తిన వివాదం 1968లో పరిష్కారమైందని, ఈ అంశాన్ని మళ్లీ లేవనెత్తాల్సిన అవసరం లేదని అసద్ చెప్పుకొచ్చారు. ప్రార్థనా స్ధలాల చట్టం 1991 ప్రార్ధనా స్థలాల మార్పిడిని నిరోధిస్తుందని, ఈ చట్టం అమలు బాధ్యత హోంమంత్రిత్వ శాఖకు అప్పగించారని అన్నారు. 1968 అక్టోబర్‌లో శ్రీకృష్ణ జనమ్మభూమి వివాదం పరిష్కారం అయిందంటూ గుర్తు చేశారు.

దావా వేసిన అడ్వకేట్‌ విష్ణు జైన్ మాట్లాడుతూ.. మధురలోని వివాదాస్పద భూమిలో ప్రతి అంగుళం శ్రీకృష్ణ భగవానుడి భక్తులకు, హిందువులకు పవిత్రమైనదని అన్నారు. కృష్ణ జన్మభూమిలోని మొత్తం 13.37 ఎకరాలను అప్పగించాలని, 1968లో కుదిరిన రాజీకి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని అంటున్నారు విష్ణు జైన్.

Next Story
Share it