కోజికోడ్‌లో ఘోర విమాన ప్రమాదం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Aug 2020 12:41 AM GMTకేరళ రాష్ట్రం కోజికోడ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వందేభారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి వస్తున్న దుబాయ్–కాళికట్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం శుక్రవారం రాత్రి 7.40 గంటల సమయంలో కోళీకోడ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. భారీగా వర్షం పడుతుండటంతో రన్‌వే నుంచి పక్కకు జారీ పక్కనే ఉన్న దాదాపు 50 అడుగుల లోతైన లోయవంటి ప్రదేశంలో పడిపోయింది.
దీంతో ఆ బీ737 విమానం రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో పైలట్ దీపక్ సాథే సహా 17 మంది ప్రాణాలు కోల్పోగా.. 125 మంది వరకు గాయాలపాలయ్యారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో విమానంలో 10 మంది చిన్నారులు సహా 184 మంది ప్రయాణీకులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కలిపి మొత్తం 191 మంది ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది.
ఇక ప్రమాదంపై తక్షణమే స్పందించిన సహాయ బృందాలు క్షతగాత్రులను వైద్యశాలలకు చేరవేశారు. రాష్ట్ర మంత్రి మొయిదీన్ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కోళీకోడ్, మలప్పుర్ జిల్లాల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఘటనాస్థలికి తరలించారు.
‘అది టేబుల్ టాప్ రన్‌వే. విమానం లోతైన లోయలో పడిపోయింది. మరణాలే కాకుండా, దాదాపు ప్రయాణీకులందరికీ గాయాలయ్యే అవకాశం ఉంది. అందుకే, పెద్ద సంఖ్యలో అంబులెన్స్‌లను, ఇతర సహాయ సామగ్రిని ఘటన స్థలికి పంపించాం’ అని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రధాన్ తెలిపారు. వర్షం, వెలుతురు సరిగ్గా లేకపోవడం సహాయక చర్యలకు ఆటంకంగా మారాయన్నారు. దాదాపు 100 మందిని సమీప వైద్యశాలలకు తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే.. రన్‌వేపై చివరి వరకు విమానం వేగంగా వెళ్లి లోయలో పడి, రెండు ముక్కలుగా విరిగిపోయిందని డీజీసీఏ ప్రకటించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు ప్రకటించింది. విమానం ల్యాండింగే సరిగ్గా జరగనట్లుగా ప్రాథమిక సమాచారం ఉందని డీజీసీఏ డైరెక్టర్ అరుణ్ కుమార్ వెల్లడించారు.
విమాన ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయ చర్యలకు సంబంధించి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని కేరళ సీఎం విజయన్‌కు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.