ఐపీఎల్ 2020 : అబుదాబీ షేక్ జాయేద్ స్టేడియం గురించి తెలుసుకుందామా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Sept 2020 12:46 PM IST
ఐపీఎల్ 2020 : అబుదాబీ షేక్ జాయేద్ స్టేడియం గురించి తెలుసుకుందామా..?

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్-2020 షెడ్యూల్ వచ్చేసింది. కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ భారత్ లో కాకుండా యుఏఈలో నిర్వహించనున్నారు. అందులో భాగంగా మూడు స్టేడియంలు ఈ బడా ఈవెంట్ కు ఆథిత్యం ఇవ్వనున్నాయి. ఆ మూడు స్టేడియంలలో అబుదాబీ లోని 'షేక్ జాయేద్ స్టేడియం' ఒకటి.

సెప్టెంబర్ 19న డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అబుదాబీ లోని షేక్ జాయేద్ స్టేడియంలో జరగనుంది. మూడేళ్ళుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి మ్యాచ్ ను ఆడుతూ ఉంది. 2018లో ఐపీఎల్ మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టును ఓడించగా.. 2019 ఐపీఎల్ మొదటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించింది. ఈ ఏడాది ముంబైను మొదటి మ్యాచ్ లో ఓడిస్తే హ్యాట్రిక్ ఓపెనింగ్ మ్యాచ్ లు గెలిచిన జట్టుగా చెన్నై రికార్డు సృష్టించనుంది.

అబుదాబీ లోని షేక్ జాయేద్ స్టేడియం 2014 లో ఐపీఎల్ మొదటి మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చింది. అప్పటి డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ను కోల్ కతా జట్టు 41 పరుగులతో ఓడించింది.

ఈ ఏడాది షేక్ జాయేద్ స్టేడియంలో 20 ఐపీఎల్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది. షేక్ జాయేద్ స్టేడియం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు:

షేక్ జాయేద్ స్టేడియంకు రెండు ఎండ్స్ ఉంటాయి. ఒకటి నార్త్ ఎండ్ కాగా.. ఇంకొకటి పెవిలియన్ ఎండ్. ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 20000. అభిమానులు ఈ ఏడాది స్టాండ్స్ లో కూర్చోవడం కష్టమే అనుకోండి.

షేక్ జాయేద్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ ను 2010లో నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా 45 టీ20 మ్యాచ్ లు ఈ స్టేడియంలో ఆడారు. టీ20 మ్యాచ్ లో అత్యధిక పరుగులు 225/7 కాగా.. అత్యల్ప స్కోర్ 87 పరుగులు. హాంగ్ కాంగ్ జట్టుకు ఈ గ్రౌండ్ లో అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన రికార్డు ఉంది.. 163 పరుగులు ఆఫ్ఘన్ జట్టు నిర్ణయించగా.. హాంగ్ కాంగ్ జట్టు ఆ స్కోర్ ను చేధించింది. ఈ ఏడాది ఐపీఎల్ లో ఆ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉందని ఆశిస్తూ ఉన్నారు.

పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఈ గ్రౌండ్ ను తమ హోమ్ గ్రౌండ్ గా చెప్పుకుంటూ ఉంటుంది. ఈ గ్రౌండ్ లో హసన్ అలీ పాకిస్థాన్ జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. నాలుగు మ్యాచ్ లలో తొమ్మిది వికెట్లు తీయగా.. ఇమాద్ వాసిమ్ అయిదు మ్యాచ్ లలో ఎనిమిది వికెట్లు తీసాడు.

ఈ స్టేడియంలోని పిచ్ స్లో బౌలర్లకు బాగా సహకరించనుంది. 150 కంటే ఎక్కువ పరుగులు చేస్తే మంచి స్కోర్ అవుతుందని గత మ్యాచ్ ల ద్వారా స్పష్టమవుతోంది. 2014 ఐపీఎల్ లో అబుదాబీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లలో రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్లు అన్ని మ్యాచ్ లలోనూ విజయం సాధించాయి. ఈ ఏడాది ఐపీఎల్ లో ఏ జట్టుకు షేక్ జాయేద్ స్టేడియం లక్కీగా మారుతుందో చూడాలి.

Next Story