దినేష్ కార్తీక్-రస్సెల్ మధ్య అప్పటి గొడవ చల్లారినట్లేనా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Sep 2020 6:34 AM GMT
దినేష్ కార్తీక్-రస్సెల్ మధ్య అప్పటి గొడవ చల్లారినట్లేనా..?

గత ఏడాది ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆండ్రే రస్సెల్ అద్భుతమైన విజయాలు అందించాడు. అయినప్పటికీ లీగ్ స్టేజ్ ను దాటలేక పోయింది. టోర్నమెంట్ మధ్యలో ఆండ్రే రస్సెల్ తనను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు పంపించడం లేదంటూ ఆరోపణలు చేశాడు. దీంతో ఆ జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్ కు, రస్సెల్ కు మధ్య గొడవ అయ్యిందంటూ కూడా కథనాలు మీడియాలో వినిపించాయి. ఐపీఎల్ లో మంచి పవర్ ఫుల్ జట్లలో కోల్ కతా కూడా ఒకటి ఈ ఏడాది యుఏఈలో జరగనున్న ఈ టోర్నమెంట్ లో ఆటగాళ్ల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే ఆ ప్రభావం జట్టు మీద పడకుండా ఉండాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది.

నైట్ రైడర్స్ జట్టు మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ ఆల్ రౌండర్ రస్సెల్, కెప్టెన్ దినేష్ కార్తీక్ ల మధ్య ఉన్న వైరం సమిసిపోతేనే జట్టు మంచి విజయాలను సాధించగలుగుతుందని అభిప్రాయపడ్డారు. 'కేకేఆర్ జట్టులో ప్రస్తుతం ఒకే ఒక్క అంశంలో సరైన క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో లాగా మీడియా ముందుకు వచ్చి రస్సెల్ జట్టు సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు అని చెప్పకూడదు. అది జట్టుతోనే చెప్పాల్సి ఉంటుంది.' అని బ్రాడ్ హాగ్ తాజాగా వెల్లడించాడు.

దినేష్ కార్తీక్ ఇటీవల మాట్లాడుతూ రస్సెల్ తో గొడవ అంశమై తాను కూడా పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉన్నానని అన్నాడు. గతంలో ఆ ఘటన చోటుచేసుకున్న తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయని కూడా తెలిపాడు.

కేకేఆర్ హెడ్ కోచ్ బ్రాండన్ మెక్ కాలమ్ డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం మారకూడదని.. పరిస్థితులు చేదాటి పోకూడదని భావిస్తూ ఉన్నాడు. ఆటగాళ్ల మధ్య బంధం దృఢంగా ఉండేలా మెక్ కాలమ్ చూసుకోవాలని హాగ్ తెలిపాడు. ఆటగాళ్ల మధ్య చిన్నపాటి పొరపొచ్చాలు వచ్చినా జట్టు ఆటతీరుపైనే మార్పులు వస్తాయని చెబుతున్నాడు హాగ్. సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్ మొదలుకాబోతోంది.. కేకేఆర్ మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 23న అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్ తో జరగనుంది.

Next Story