ఎంపీ రామ్మోహన్ నాయుడు రికార్డు.. పిన్నవయస్సులోనే ప్రతిష్టాత్మక అవార్డు..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Jun 2020 9:06 AM ISTశ్రీకాకుళం ఎంపీ, టీడీపీ యువనేత కింజారపు రామ్మోహన్ నాయుడు 'సంసద్ రత్న అవార్డు-2020'కి ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే పిన్న వయస్సులోనే ఈ అవార్డుకు ఎంపికైన ఎంపీగా రామ్మోహన్ నాయుడు రికార్డు సృష్టించారు. ఎంపీగా కనపరిచిన అత్యుత్తమ పనితీరు, ప్రజాసమస్యల పరిష్కారంలో చూపిన చొరవను గుర్తించి జ్యూరీ ప్రత్యేక అవార్డు ప్రకటించింది.
మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో 2010 లో ప్రారంభమయిన సంసద్ రత్న అవార్డులను.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల జ్యూరీ ఎంపిక చేపింది. దేశవ్యాప్తంగా 8 మంది లోక్‌సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులను 2019-20 సంవత్సరం సంసద్ రత్న అవార్డులకు ఎంపిక చేశారు. ఈ విషయమై రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు, టీడీపీ, కింజరాపు కుటుంబ వారసునిగా ప్రజాసేవలో వున్న తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. శశి థరూర్, సుప్రియ సూలే వంటి సీనియర్ నాయకులతో కలిసి ఈ అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా వుందన్నారు.
ఈ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని.. శ్రీకాకుళం పార్లమెంటు సభ్యునిగా తాను చేసిన సేవలను గుర్తించిన ప్రజలు తనను మళ్లీ ఎంపీగా ఎన్నుకున్నారని.. ఈ అవార్డు వారికే అంకితం అని పేర్కొన్నారు. దివంగత టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు కుమారుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన రామ్మోహన్ నాయుడు.. 2014 ఎన్నికల్లో మొదటిసారి శ్రీకాకుళం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం 2019లో జగన్ గాలి బలంగా ఉన్న తరుణంలో కూడా రెండవమారు ఎంపీగా గెలిచారు.