ఇక్కడ డిజాస్టర్.. మరి అక్కడ?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Aug 2020 3:25 PM ISTటాలీవుడ్ చరిత్రలో టాప్ ఎంటర్టైనర్ల జాబితా తీస్తే అందులో ‘కిక్’కు కచ్చితంగా స్థానం ఉంటుంది. మాస్ రాజా రవితేజ కెరీర్లో అతి పెద్ద విజయాల్లో అది ఒకటి. ఎక్కువ యాక్షన్ సినిమాలే చేసిన సురేందర్ రెడ్డి.. తొలిసారి పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్లోకి దిగిన చిత్రమిది. ఇందులో కామెడీ సీన్లు ఇప్పటికీ జనాల్ని అలరిస్తుంటాయి.
తెలుగులో భారీ విజయం సాధించిన ఈ చిత్రాన్ని హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా సాజిద్ నడియాడ్‌వాలా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఐతే తర్వాత తెలుగులో ‘కిక్’కు సీక్వెల్ తీస్తే అది చీదేసింది. ఈ సినిమాను నమ్ముకున్న అందరికీ చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఐతే ఇప్పుడు హిందీలో ‘కిక్’కు సీక్వెల్ తెరకెక్కబోతుండటం విశేషం. మంగళవారం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేశాడు దర్శక నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా. తొలి ‘కిక్’లో హీరోయిన్‌గా నటించిన జాక్వెలినే రెండో పార్ట్‌లో కూడా కథానాయికగా నటించనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. కిక్-2కు స్క్రిప్టు కూడా లాక్ అయినట్లు సాజిద్ తెలిపాడు.
మళ్లీ షూటింగ్స్ మొదలై.. సల్మాన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు ఈ చిత్రాన్ని మొదలుపెట్టాలని సాజిద్ భావిస్తున్నాడు. ‘కిక్’కు సాజిద్ నిర్మాత మాత్రమే. ‘కిక్-2’కు మాత్రం దర్శకత్వ బాధ్యతలు కూడా అందుకుంటున్నాడు. తెలుగు ‘కిక్-2’తో సంబంధం లేకుండా హిందీలో వేరే స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు. మరి తెలుగులో ఆడని సీక్వెల్.. హిందీలో హిట్టవుతుందేమో చూడాలి.