అత్యాచార ఆరోపలు ఎదుర్కొంటున్న బిషప్‌కు కరోనా పాజిటివ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 July 2020 1:52 PM GMT
అత్యాచార ఆరోపలు ఎదుర్కొంటున్న బిషప్‌కు కరోనా పాజిటివ్‌

కేరళ నన్‌పై లైంగికదాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌కు కరోనా సోకింది. ఆయన లాయర్‌ కరోనా బారీన పడడంతో పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లోని తన నివాసంలో ఉంటున్నఆయన సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇప్పుడు ఆయనకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని జలంధర్‌ నోడల్ అధికారి టీపీ సింగ్‌ తెలిపారు.

గతంలో ఆయన జలందర్‌ చర్చ్‌కు బిషప్‌గా వ్యవహరించారు. ఓ నన్‌పై అత్యాచారం చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేరళలోని కొట్టాయం జిల్లా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఆయన గత కొద్ది రోజుల క్రితం బెయిల్‌పై బయటికి వచ్చాడు. కాగా, బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ కొంతకాలంగా కోర్టు విచారణకు గైర్హాజరు కావడంపై కేరళలోని కొట్టాయం అదనపు జిల్లా కోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. జలంధర్ ప్రాంతం కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఉండడం వల్లే హాజరుకాలేకపోయాడని ఆయన తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

బిషప్ నివాసం ఉంటున్న ప్రాంతం కంటైన్‌మెంట్ జోన్‌లో లేదని, ఫ్రాంకో ఉద్దేశపూర్వకంగా కేసును పొడిగించేందుకు ప్రయత్నిస్తున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో 2018లో మంజూరు చేసిన బెయిల్‌ను కోర్టు రద్దు చేసింది. అలాగే ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. ఈ నెల 6న బిషప్ కరోనా టెస్టు చేయించుకోగా.. ఫలితాల్లో నెగటివ్ వచ్చింది. గొంతు నొప్పి, దగ్గు రావడంతో సోమవారం మరోసారి కరోనా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది.

Next Story
Share it