కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం.. మంత్రి పేరు బయటకు  

By సుభాష్  Published on  15 July 2020 9:34 AM GMT
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం.. మంత్రి పేరు బయటకు  

గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారం కేరళ ప్రభుత్వాన్ని ఇరకాటంలో తోసింది. ఈ కేసుకు సంబంధించి సీఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి.‌ కేరళ సీఎం పినరయి విజయన్‌.. ప్రిన్సిపల్‌ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం శివశంకర్‌ను తొలగించారు. ప్రస్తుతం ఈ కేసును ఎన్.ఐ.ఏ. విచారిస్తోంది. ఈ విచారణలో కేబినెట్ మినిస్టర్ పేరు బయటకు వచ్చింది. హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కెటి జలీల్ పేరు వినపడుతోంది. దీంతో ఎల్.డి.ఎఫ్. ప్రభుత్వం పెద్ద చిక్కుల్లో పడింది.

కాన్సులేట్‌కు సంబంధించిన పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ ఆరోపణలు ఎదుర్కోవడంతో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.

ఏప్రిల్ నెల నుండి జూన్ వరకూ స్వప్న సురేష్ కాల్ రికార్డ్స్ ను పరిశీలించగా ఆమె జలీల్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. జూన్ నెలలోనే జలీల్ తో ఆమె తొమ్మిది సార్లు ఫోన్ లో మాట్లాడింది. స్వప్న జలీల్ కు ఒక సారి కాల్ చేయడం, ఒక మెసేజ్ పంపించడం జరిగింది. జలీల్ తిరిగి ఎనిమిది సార్లు ఆమెకు కాల్ చేశాడు. కాల్ లో మాట్లాడిన సమయం 64 సెకండ్ల నుండి 195 సెకెండ్ల వరకూ ఉంది. ఇప్పటి వరకూ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం శివశంకర్‌ పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి.. మొదటిసారి జలీల్ పేరు బయటకు రావడంతో కేసు మరింత సంచలమైంది. ఈ ఆరోపణలపై జలీల్ స్పందించాడు. తాము రమదాన్ కిట్స్ విషయంలో మాత్రమే మాట్లాడామని ఆయన చెప్పుకొచ్చాడు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన క్యాబినెట్ మినిస్టర్ ను వెనకేసుకువచ్చారు. కొందరు నోటికి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారని.. వారందరూ జలీల్ మీద అనవసరపు ఆరోపణలు చేస్తూ ఉన్నారని పినరయి విజయన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం శిశంక‌ర్‌.. ఇద్ద‌రు గోల్డ్ స్మ‌గ్లింగ్ నిందితుల‌తో మాట్లాడిన‌ట్లు విజ‌య‌న్ తెలిపారు. ఐటీ శాఖ‌లో స్వ‌ప్నా సురేశ్ ను ఎలా రిక్రూట్ చేశార‌న్న కోణంలో ఇప్ప‌టికే విచార‌ణ మొద‌లైన‌ట్లు సీఎం విజ‌య‌న్ చెప్పారు. ఆ మ‌హిళ‌కు ఫోన్ కాల్ చేసిన‌ట్లు కూడా మంత్రి కేటీ జ‌లీల్ అంగీక‌రించారని.. యూఏఈ కాన్సులేట్ నుంచి మెసేజ్ వ‌చ్చిన‌ట్లు ఆయ‌న ఓ స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేశారు.

మంగళవారం నాడు కొన్ని కాల్ రికార్డులు మీడియాకు లీక్ అయ్యాయి. నిందితుల్లో ఒక్కడైన సరిత్.. శివశంకర్ తో టచ్ లోనే ఉన్నాడు. సరిత్ శివ శంకర్ మొబైల్ కు తొమ్మిది సార్లు కాల్ చేయగా.. శివ శంకర్ సరిత్ కు అయిదు సార్లు కాల్ చేశాడు. ఏప్రిల్ 20 నుండి జూన్ 1 మధ్య ఈ కాల్స్ చోటుచేసుకున్నాయి. 8 సెకెండ్ల నుండి 755 సెకెండ్ల పాటూ వారు మాట్లాడుకున్నారు. శివశంకర్ ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూజాపుర లోని అతడి ఇంటిపై రైడ్ నిర్వహించారు అధికారులు.

స్మగ్లింగ్ లో కొదువల్లి పేరు:

కేరళ రాష్ట్రంలోని ఆభరణాల హబ్ గా కొదువల్లికి పేరు ఉంది. ఎలాంటి గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం బయటకు వచ్చినా డైరెక్ట్ గా లేదా ఇన్ డైరెక్ట్ గా కొదువల్లితో లింక్ లు ఉంటూ ఉంటాయి. తాజా వ్యవహారం విషయంలో కూడా కొదువల్లి పేరు బయటకు వచ్చింది. బంగారం స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బును తీవ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారనే ఆరోపబాలు కూడా ఉన్నాయి. దీంతో ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

Next Story
Share it