ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న‌ కేర‌ళ‌ గోల్డ్‌ స్మగ్లింగ్ కేసు.!

By Medi Samrat  Published on  9 July 2020 7:15 AM GMT
ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న‌ కేర‌ళ‌ గోల్డ్‌ స్మగ్లింగ్ కేసు.!

గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారం ప్ర‌స్తుతం కేరళలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసుకు సంబంధించి సీఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణలు వ‌స్తున్న‌ నేపథ్యంలో సీఎం పినరయి విజయన్‌.. ప్రిన్సిపల్‌ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం శివశంకర్‌ను తొలగించారు. అయితే.. ఈ కేసులో ప్రధానంగా స్వప్న సురేశ్‌ పేరు వినిపిస్తోంది. కేరళ సీఎం కార్యాలయ వ్యవహారాలు తెలిసినవారికి స్వప్న సురేశ్‌ పేరు సుపరిచతమే.

స్వప్న సురేశ్.. కేర‌ళ‌ రాష్ట్ర ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పరిధిలోని స్పేస్‌ పార్క్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్ వ్య‌వ‌హ‌రించింది. అయితే.. ఆరోప‌ణ‌ల నేఫ‌థ్యంలో.. అంత‌కుముందు సీఎం విజయన్‌తో కలిసి స్వప్న దిగిన ఫొటోలు ప్ర‌స్తుతం వైరల్‌గా మారాయి. దీంతో స్వప్న సురేశ్ ఎవరనేది ప్రస్తుతం హాట్‌ టాఫిక్‌గా మారింది.

Kerala

కేరళకు చెందిన స్వప్న తండ్రి అబుదాబిలో స్థిరపడ్డారు. స్వప్న కూడా అక్కడే జన్మించింది. చిన్నప్పటి నుండి చురుకుగా ఉండే స్వ‌ప్న విద్యాభ్యాసం కూడా‌ అబుదాబిలోనే జ‌రిగింది. అనంత‌రం అక్కడే విమానాశ్రయంలో ఉద్యోగం సంపాదించి.. అక్కడ ప్రయాణికుల సేవా విభాగం గురించి క్లుప్తంగా తెలుసుకుంది.

అనంత‌రం ఇండియా వచ్చిన స్వప్న సురేష్.. రెండేళ్లు ఓ ట్రావెల్‌ ఏజెన్సీలో ఉద్యోగం చేసింది. ఆ తర్వాత 2013లో తిరునంతపురం ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్‌ ఇండియా సాట్స్‌లో ఉద్యోగం పొందారు. అయితే.. అక్కడ ఒక అధికారిని తప్పుడు కేసులో ఇరికించడం కోసం నకిలీ పత్రాలు సమర్పించార‌న్న ఆరోప‌ణ‌ల‌తో స్వప్నపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆ కేసులో స్వప్నను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ త‌ర్వాత‌.. ఎయిర్‌ ఇండియా ఉద్యోగం మానేశారు.

ఆపై.. యూఏఈ కాన్సులేట్‌లో ఒక కీలక పదవిలో నియమితులయ్యారు. అక్కడే ఆమె పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, కేరళ దౌత్య వేత్తలతో పరిచయాలు పెంచుకున్నారు. అరబిక్‌తో పాటు పలు భాషలపై పట్టున్న స్వప్నకు ఇది చాలా సులువుగా సాధ్యమైంది. అయితే స్వప్న అనేక అవకతవకలకు పాల్పడటంతో ఆమెను ఆ పదవి నుంచి తొలగించారు.

ఈ క్రమంలో అక్కడ ఏర్పడిన పరిచయాలతో స్వప్న కేరళ ఐటీ విభాగంలో ఉద్యోగం సంపాదించారు. అలా సీఎంఓలోని కొందరితో పరిచయాలు పెంచుకున్నారు. ఈ క్రమంలోనే తనకున్న పరిచయాలను అసరాగా చేసుకుని బంగారం అక్రమ తరలింపుకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.

మరోవైపు ఈ కేసులో నిందితుడైన శివశంకర్‌కు స్వప్నతో సత్సంబంధాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం స్వప్న మాత్రం పరారీలో ఉన్నారు. ఆమెను విచారిస్తే తప్ప ఈ గోల్డ్‌ స్మగ్లింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.

ఇదిలావుంటే.. తిరువనంతపురం ఎయిర్ పోర్టులో సోమవారం పెద్ద మొత్తంలో బంగారం పట్టుపడింది. దౌత్య మార్గంలో తరలిన రూ. 15 కోట్ల విలువైన 30 కిలోల బంగారం విమానాశ్రయంలో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేరళలో యూఏఈ కాన్సులేట్‌లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని కస్టమ్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు.

పోలీసులు అతన్ని విచారించగా.. ఇందులో ఐటీ విభాగంలో పనిచేసే స్వప్న సురేశ్‌ హస్తం ఉన్నట్టు వెల్లడించాడు. దీంతో గోల్డ్‌ స్మగ్లింగ్‌కు సంబంధించి స్వప్న పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు రెండు రోజుల కిందటే ఆమెను కేరళ ఐటీ శాఖ నుంచి తొలగించారు.

Next Story