కేరళ: ఏనుగు మృతిపై కేంద్రం సీరియస్
By సుభాష్ Published on 4 Jun 2020 12:20 PM ISTకేరళలో ఏనుగుపై జరిగిన దారుణంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది. నిందితులనుపట్టుకునేందుకు కేసు దర్యాప్తులో ఏ ఒక్క అంశాన్ని వదలబోమని కేంద్రం స్పష్టం చేసింది. కాగా, పండులో బాణాసంచా పెట్టి ఏనుగుకు తినిపించడం భారతీయ సంస్కృతి కాదని కేంద్ర అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన చాలా బాధాకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని అన్నారు.
మానవత్వానికే మాయని మచ్చలా మిగిలిపోయే ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. గర్భంతో ఉన్న ఏనుగు సైలెంట్ వ్యాలీ వద్ద ఉన్న ఓ గ్రామంలోకి ఆహారం కోసం వచ్చింది. పాపం అది గ్రామంలో ఉన్న ప్రజలను ఏమీ చేయలేదు. నెమ్మదిగా ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్తుండగా.. గ్రామంలోని కొంతమంది దానికి పైన్ ఆపిల్ ఆశ చూపారు. పాపం ఆ ఏనుగుకు తెలీదు..అది తన కడుపు నింపే పండు కాదు..ప్రాణాలు తీసే పండు అని. ఏనుగుకు ఇచ్చిన పండులో బాంబ్ పెట్టారు గ్రామస్తులు. ఎంతో ఆశగా వారి వద్ద నుంచి తొండంతో పైన్ ఆపిల్ తీసుకున్న ఏనుగు దానిని నోటిలో పెట్టుకోగానే భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఆ పేలుడుతో ఏనుగు నోటి వెంట రక్తం ధారాళంగా కారింది.
ఇంతలో ఎవరో అటవీశాఖ సిబ్బందికి సమాచారమివ్వడంతో వారు సురేందర్, నీలకంఠన్ అనే మరో రెండు ఏనుగులను నదిలోకి దింపి ఆ ఏనుగును పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కానీ దానికి తగిలిన గాయంతో అది ఎటూ కదల్లేని పరిస్థితిలో అక్కడే ఉండిపోయింది. ఆఖరికి మే 2వ తేదీ సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో బిడ్డతో సహా ప్రాణాలు విడిచింది. ఆఖరికి మల్లప్పురం అటవీశాఖ అధికారులే ఆ ఏనుగుకు అంత్యక్రియలు నిర్వహించారు.
ఏనుగు మృతిపై వెల్లువెత్తిన విమర్శలు:
అయితే ఫైనాపిల్ లో బాంబు పెట్టి ఏనుగు మృతికి కారణమైన వారిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఏనుగు ప్రాణం తీసిన నిందితుల ఆచూకీ చెబితే రూ.50వేలు హ్యుమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఆఫ్ ఇండియా బహుమతి ప్రకటించింది.