కేటీఆర్ కు ఎమ్మెల్యే గండ్ర ఫోన్.. స్పందించిన కేసీఆర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Aug 2020 6:35 AM GMT
కేటీఆర్ కు ఎమ్మెల్యే గండ్ర ఫోన్.. స్పందించిన కేసీఆర్

ప్రముఖుల్ని రక్షించేందుకు యుద్ధ విమానాల్ని.. ఆర్మీ వాహనాల్ని రంగంలోకి దించటం చాలాసార్లు చూసే ఉంటాం. సామాన్యుల్ని రక్షించేందుకు హెలికాఫ్టర్లను రంగంలోకి దించే సీన్లు సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. తాజాగా మాత్రం రియల్ గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. ఆపదలో చిక్కుకున్న రైతుల్ని రక్షించేందుకు రెండు ఆర్మీ హెలికాఫ్టర్లను పంపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు ఆపదలో ఉన్నారన్న విషయం తెలిసినంతనే స్పందించిన సీఎం కేసీఆర్.. నిమిషాల వ్యవధిలోనే నిర్ణయం తీసుకోవటం.. ఆర్మీ హెలికాఫ్టర్ ను రంగంలోకి దింపి రైతుల్ని కాపాడారు. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే..

గడిచిన నాలుగైదు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. వాగులు.. వంకలు.. ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కుందనపల్లిలోని చలివాడు ఒడ్డున ఉన్న పొలాల్లో ఉంచిన విద్యుత్ మోటార్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుందని భావించిన స్థానిక రైతులు బయలుదేరారు. మోటార్లు తెచ్చేందుకు రెండు ట్రాక్టర్లలో బయలుదేరారు.

వర్షం కారణంగా పొలం మొత్తం చిత్తడిగా ఉండటంతో ట్రాక్టర్ దిగబడింది. దీంతో..వారికి సాయం చేసేందుకు మరో పది మంది రైతులు అక్కడికి వెళ్లారు. ఇదిలా ఉండగా.. చలివాగు ప్రవాహం ఒక్కసారిగా పెరిగి.. చూస్తున్నంతలోనే తీవ్ర రూపం దాల్చింది. దీంతో.. రైతులకు ఇరువైపులా వరదనీరు చేరటంతో వారు ముందుకు.. వెనక్కి వెళ్లలేని పరిస్థితి. దీంతో.. వాగులో చిక్కుకుపోయిన రైతుల కోసం స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరామణా రెడ్డికి ఫోన్ చేశారు. ఆయన ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేసి.. పరిస్థితి చెప్పి వారిని రక్షించేందుకు హెలికాఫ్టర్ ను పంపాల్సిందిగా కోరారు.

గండ్ర మాటలకు వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కు చెప్పారు. ఆయన వెంటనే ఆర్మీ అధికారులతో మాట్లాడి.. పరిస్థితిని వివరించారు. దీంతో.. రైతుల్ని రక్షించేందుకు వీలుగా హకీంపేట రెండు ఆర్మీ హెలికాఫ్టర్లు రంగంలోకి దిగాయి. రైతులు చిక్కుకుపోయిన ప్రాంతానికి వెళ్లి.. వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. వాగు వద్ద సహాయక చర్యల్ని ఎమ్మెల్యే గండ్ర స్వయంగా పరిశీలించారు. అపాయంలో చిక్కుకుపోయిన రైతుల్ని రక్షించేందుకు రెండు హెలికాఫ్టర్లను రంగంలోకి దించి.. పలువురు రైతుల ప్రాణాల్ని నిలిపిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.Next Story