కరోనా తగ్గుముఖం పడుతోంది: సీఎం కేసీఆర్‌

By సుభాష్  Published on  27 April 2020 12:53 AM GMT
కరోనా తగ్గుముఖం పడుతోంది: సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు అవుతున్న కారణంగా కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మరి కొన్ని రోజులు ఇలాగే ప్రజలు సహకరించి లాక్‌డౌన్ పాటిస్తే ఎంతో మేలని అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటిస్తే తొందరలోనే కరోనా బారి నుంచి బయటపడవచ్చని తెలిపారు.

కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ అమలుపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆదివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ సమావేశం కానున్నారు. ఈ సమావేశం లాక్‌డౌన్‌ పెంచాలా..? వద్దా.. అనే దానిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాల అమలు, లాక్‌డౌన్‌ అమలుపై కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా నిత్యావసరాలు సక్రమంగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు సగటుకన్నా తక్కువగా ఉందని, ఇది కొంత మేలు కలిగించే అంశమని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

ఇలాగే మరి కొన్ని రోజలు లాక్‌డౌన్‌ను కఠినంగా పాటిస్తే రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తి పూర్తిస్థాయిలో తగ్గిపోయే అవకాశం ఉందని అన్నారు. కరోనా వ్యాప్తిని పూర్తిస్థాయిలో అరికట్టాలంటే లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయాలని అధికారులకు సూచించారు. నేడు మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌ ఉన్నందున దేశ వ్యాప్తంగా పరిస్థితుల గురించి ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించడం వల్లే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెద్దగా పెరగడం లేదని, ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకోవడం వల్ల రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయన్నారు.

Next Story