ఇక ఆ నేతలు ఇంట్లో కూర్చోవాల్సిందేనా..!

By సుభాష్  Published on  28 March 2020 11:15 AM
ఇక ఆ నేతలు ఇంట్లో కూర్చోవాల్సిందేనా..!

టీఆర్‌ఎస్‌లో చెలామణి అయిన నేతలు ఇక ఇంట్లోనే కూర్చువాల్సిందే. ఇప్పట్లో ఎలాంటి పదవులు భర్తీ చేయకపోవడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలకు ఈ సారి కేసీఆర్‌ పక్కన పెట్టేశారని తెలుస్తోంది. తొలి దఫాలో గెలుపొందిన తర్వాత కీలక నేతలను కేబినెట్‌లోకి తీసుకున్నారు సీఎం కేసీఆర్‌. అందులో తుమ్మల నాగేశ్వరరావు, నాయిని నర్సింహారెడ్డి తదితరులున్నారు.

ఇక రెండో సారి ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్‌లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. 2018 ఎన్నికల్లో అనేక మంది కీలక నేతలు ఓటమి చవి చూశారు. వీరంతా పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీరిలో తుమ్మల, మధుసూదనచారి, జూపల్లి కృష్ణారావులున్నారు. వీరిని శాసనసభ మండలికి తీసుకుంటారని అందరూ భావించారు. అంతేకాదు పట్నం మహేందర్‌రెడ్డిని మినహాయించి ఓటమి చెందిన నేతలెవరికీ శాసన మండలిలో అవకాశం ఇవ్వలేదు కేసీఆర్‌.

ఇక తాజాగా రాజ్యసభ పదవులు రెండు భర్తీ అయ్యాయి. అందులో కేశవరావును తిరిగి పెద్దల సభకు పంపించగా, కొత్తగా ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డికి రాజ్యసభ పదవిని కట్టబెట్టారు. పాత వారెవరికీ రాజ్యసభ పదవి ఇచ్చేందుకు కేసీఆర్‌ సుముఖత చూపించలేదు. మరోవైపు తనకు సీటు త్యాగం చేసిన పొంగులేని శ్రీనివాస్‌రెడ్డిని కూడా గులాబీ బాస్‌ పక్కనపెట్టేశారు. ఈ సారి కేసీఆర్‌ ప్లాన్‌ అంతా పక్కాగా ఉందని రాజకీయ నేతలంటున్నారు.

కేటీఆర్‌ ప్రమేయం ఉందా..?

గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, నాయిని నరసింహారెడ్డి వంటివారిని పక్కనపెట్టడం వెనుక కేటీఆర్‌ ప్రమేయం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తన కుమారుడు కేటీఆర్‌కు ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త రకం నాయకత్వాన్ని కేటీఆర్‌ ప్రోత్సహిస్తున్నారన్న టాక్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఇక ప్రభుత్వంలో సీనియర్లకు అవకాశం లేదని పార్టీ నేతలంటున్న మాట. మరి భవిష్యత్తులో వీరికి చోటు లభించడం కష్టమేనన్న మాట వినిపిస్తోంది.

Next Story