ప్రధాన నగరాల్లోనే కరోనా.. మనల్ని వదిలిపోయేలా లేదు
By తోట వంశీ కుమార్ Published on 11 May 2020 9:14 PM ISTదేశంలోని ప్రధాన నగరాల్లోనే కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉందని, ఇప్పుడప్పుడే కరోనా మనల్ని వదిలిపోయేలా లేదని, రైళ్లను అప్పుడే పునరుద్దరించొద్దని సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయని, భారత దేశం నుంచే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌కు చెందిన పలు కంపెనీలు వ్యాక్సిన్‌ను కనుగొనడంలో పురోగతిని సాధించాయని జులై, ఆగస్టు నెలలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వలసకూలీలను అనుమతించాలని, లేకపోతే ఆందోళనలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలన్నారు. రైలులో ప్రయాణించే ప్రయాణీకులందరినీ క్వారంటైన్ చేయడం సాధ్యం కాదని, ప్రయాణీకుల రైళ్లను అప్పుడే పునరుద్దరించొద్దని కోరారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉందని, ఇప్పుడప్పుడే కరోనా మనల్ని వదిలిపోయేలా లేదన్నారు.
కరోనా కలిసి బతకం తప్పదని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, వైద్యపరంగా సర్వ సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో పరికరాలు, మందులు, మాస్కులు, పిపిఇ కిట్లు, బెడ్లు.. ఇలా కావాల్సినవన్నీ అందుబాటులో ఉన్నాయని, ఏ కొరతా లేదని ప్రధానికి వివరించారు. కట్టడి ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. పాజిటివ్, యాక్టివ్ కేసులు లేని జిల్లాల్ని ఆరెంజ్, గ్రీన్‌జోన్లుగా మార్చాలని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాల అప్పులను రీషెడ్యూల్ చేయాలని కేసీఆర్ కోరారు.