మాస్క్ లేకుండా బ‌య‌టికి వెళ్లారో.. రూ.1000 క‌ట్టాల్సిందే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 May 2020 6:27 AM GMT
మాస్క్ లేకుండా బ‌య‌టికి వెళ్లారో.. రూ.1000 క‌ట్టాల్సిందే

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ గ‌డువు నిన్న‌టితో ముగియ‌డంతో దానిని ఈ నెల 29 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్‌కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో మాస్క్ ధ‌రించ‌డాన్ని త‌ప్పని స‌రి చేశారు. మాస్క్ లేకుండా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో తిరిగే రూ.1000 జ‌రిమానా విధిస్తామ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. ఈ మార్గ‌ద‌ర్శకాల‌ను ఖ‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌ను ఆదేశించారు.

నిత్యావసర వస్తువులు, ఉత్పత్తి, విత్తనాలు, ఎరువులు సహా వ్యవసాయ సంబంధ దుకాణాలు వంటి వాటికి అనుమతి ఇచ్చింది. అలాగే, రాష్ట్రం లోపల వస్తువుల రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధి హామీ పనులు, ఆసుపత్రులు, మందుల దుకాణాలు, క్లినిక్‌లు, టెలికం, ఇంటర్నెట్, పెట్రోలు పంపులు, పోస్టల్, ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, బ్యాంకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సేవలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాలు (శ్రామిక్ రైళ్ల మినహాయింపు), అంతర్రాష్ట్ర ప్రజా రవాణా, ఇతర రాష్ట్రాల నుంచి వ్యక్తుల రాకపోకలు(అనుమతి పొందినవారికి మినహాయింపు), మెట్రో రైళ్లు, పాఠశాలలు, శిక్షణ సంస్థలు, హోటళ్లు, లాడ్జీలు, బార్లు, పబ్బులు, సినిమా హాళ్లు, థియేటర్లు, షాపింగ్ మాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, సామూహికంగా మతపరమైన కార్యక్రమాలు, క్రీడలు, వినోద కార్యక్రమాలు వంటి వాటికి జోన్లతో సంబంధం లేకుండా అన్నింటిని నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్రమంతటా రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. అత్యవసరంగా వైద్య సహాయం కావాల్సినవారికి మాత్రమే ఆ సమయంలో బయటకు వెళ్లడానికి అనుమతినిస్తారు. దవాఖానలు, మెడికల్‌ షాపులు మినహా అన్ని రకాల దుకాణాలు సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

Next Story