తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం..రైతు రుణాలు మాఫీ

By సుభాష్  Published on  8 May 2020 5:27 AM GMT
తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం..రైతు రుణాలు మాఫీ

తెలంగాణ రాష్ట్ర రైతులను ఆదుకోవడానికి రూ. 25 వేల లోపు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. దీని కోసం రూ.1210 కోట్లను గురువారం ఆర్థికశాఖ విడుదల చేసింది. వ్యవసాయశాఖ నుంచి రెండు, మూడు రోజుల్లో నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. ప్రభుత్వం నిర్ణయంతో దాదాపు 5.88 లక్షల మంది రైతుల పంట రుణాలు ఒకేసారి మాఫీ కానున్నాయి. రుణమాఫీ అయిన రైతులు బ్యాంకుల నుంచి కొత్త రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉంది. కుటుంబానికి లక్ష రూపాయల వరకు పంట రుణాలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రూ.25వేల లోపు పంట రణాలున్నవారికి దశల వారీగా మాఫీ కానుంది.

రాష్ట్రంలో మొత్తం రుణమాఫీ లబ్దిదారులు 40.66 లక్షల మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో 5.88 లక్షల మంది రూ. 25వేల లోపు రుణాలు తీసుకున్నవారున్నారు. రుణమాఫీ సొమ్మును రైతులకు చెక్కుల రూపంలో అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకే డబ్బులను నేరుగా బదిలీచేయాలని నిర్ణయించింది.

రైతుబంధుకు రూ.7వేల కోట్లు

మరో వైపు ఈ సీజన్‌లో రైతుబంధు నిధులను కూడా ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఇందు కోసం ఆర్థిక శాఖ రూ.7వేల కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను వ్యవసాయశాఖకు కేటాయించారు. జనవరి 31వరకు రైతుబంధు పోర్టల్‌లో వివరాలు నమోదైన రైతులను గుర్తించి ఎకరాకు రూ.5వేల చొప్పున వానకాలం రైతుబంధు డబ్బులను చెల్లిస్తామని అధికారులు పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రూ.25వేల రుణాల మాఫీ కోసం రూ.1210 కోట్లు, రైతుబంధు కింద రూ.7వేల కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు, వ్యవసాయశాఖ అధికారులతో ఇద్దరు మంత్రులు సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం కోటి 40 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు చెల్లించామని తెలిపారు.

Next Story